అసెంబ్లీలో నవ్వులు పూయించిన రఘు రామకృష్ణ రాజు, జనసేన ఎమ్మెల్యే మాధవి
AP Assembly: ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు, జనసేన ఎమ్మెల్యే మాధవి మధ్య చమత్కారాలు సభలో నవ్వులు పూయించాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో చేనేత కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు.
మాధవి మాట్లాడిన తీరును అభినందించిన డిప్యూటీ స్పీకర్.. చేనేత సమస్యలను చక్కగా వివరించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించారు. అందుకు బదులుగా రఘు రామకృష్ణ రాజు స్పందిస్తూ.. "ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనేనా?" అని ప్రశ్నించారు. వెంటనే తాను చేనేత చీరను ధరించానని మాధవి నవ్వతూ సమాధానమిచ్చారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి. రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉందని, ముడిసరుకుల ధరలు పెరిగి చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. ఈ కారణంగా సుమారు రాష్ట్రంలో 50 శాతం మగ్గాలు మూతపడిపోయాయని సభ దృష్టికి తెచ్చారు.
గుజరాత్‌లోని బిజోడీ అనే గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి అధిక లాభాలు ఆర్జిస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం నేతన్నలు మగ్గాలు మూసుకుని కూలీలుగా మారిపోతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల న్యాయం జరుగుతుందని చేనేత కార్మికులు కోరుకుంటున్నారని చెప్పారు. నేతన్నకు నెలకు నికర ఆదాయం రూ.8 వేల నుంచి రూ.10 వేలు వచ్చేలా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. నేతన్నలకు ఇళ్లు ఇచ్చేటప్పుడు వారికి స్థలం ఉంటే షెడ్లు కట్టుకోవడానికి వేరే బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇది ప్రశ్నోత్తరాల సమయం, మీరు సూచనలు చేస్తున్నారు. ప్రశ్నలు అడగండి అని రఘు రామకృష్ణ రాజు సూచించారు.