అన్యమత ఉద్యోగులు ప్రభుత్వానికి అప్పగింత: టీటీడీ కీలక నిర్ణయం
TTD: టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.
TTD: టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. సోమవారం టీటీడీ పాలకమండలి సమావేశం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సమావేశం ఇది. ఐదు గంటల పాటు సుమారు 80 అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.
సర్వదర్శనానికి వచ్చే భక్తులకు మూడు గంటల్లో దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీనివాస సేతు పై వంతెనకు గరుడ వారధిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు.
తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లోని టీటీడీ నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయించనున్నారు.పర్యాటక శాఖ ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు టీటీడీ పాలకవర్గం తెలిపింది. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతిని రద్దు చేశారు.
తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అనుమతిని కల్పిస్తామని తెలిపారు.శారదా పీఠం లీజును రద్దు చేసి ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోనున్నారు.శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.