Cyclone Alert: ఏపీకి మరో తుపాన్ గండం పొంచి ఉంది. వర్షాలు లేవు అనుకున్న సమయంలో భారత వాతావరణ శాఖ మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పింది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఈసారి రాయలసీమ టార్గెట్ అవుతుందని తెలిపింది.
ఏపీ రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరి కోతలు చేపడుతున్నారు. ఈ సమయంలో భారత వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఒక తుపాన్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. అందుకు సంకేతాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో కనిపిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం అక్కడ ఒక ఆవర్తనం ఏర్పడుతోంది.
ఆ ఆవర్తనం క్రమంగా బలపడుతూ..ఈనెల 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆ అల్పపీడనం క్రమంగా బలపడుతూ..పశ్చిమం, వాయవ్య దిశగా కదులుతుందని..ఆ తర్వాత అది మరింత బలపడి తుపాన్ గా మారే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెబుతోంది. చివరకు అది నవంబర్ 26, 27 తేదీల్లో శ్రీలంకకు ఉత్తరం వైపుగా వస్తుందని ఐఎండీ సూచిస్తోంది.
ఈ తుపాన్ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతోపాటు వాటిలోనే భాగమైన ఏపీపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలపై కూడా తుపాన్ ప్రభావం ఉంటుందని చెప్పారు.
ఈ హెచ్చరికలను లెక్కలోకి తీసుకుని..రైతులు తుపాన్ వచ్చే లోపే వరికోతలను పూర్తి చేసుకోవడం మంచిది. వరిని బయట ఆరబెడితే వర్షం వచ్చే లోపే వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మేలు. తుపాన్ వస్తే వర్షం పడితే వరి ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వరి కొనుగోళ్లను ప్రారంభించింది. రైతులు త్వరగా కోతలు చేపట్టి అమ్ముకుంటే వర్షం నుంచి తప్పించుకున్నట్లు అవుతుంది.