Red Sandalwood: పుష్ప సినిమాను కాపీకొడుతున్న ఎర్ర స్మగ్లర్లు
Red Sandalwood: భక్తుల రూపంలో మహానంది ఆలయంలో ఎర్ర కూలీలు తిష్ట
Red Sandalwood: ఎర్ర దొంగలు రూటు మార్చారు. ఎర్ర బంగారాన్ని దేశ, విదేశాలకు తరలించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో ఎర్ర బంగారాన్ని తరలిస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డ తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నల్లమలలో ఎర్ర బంగారం దందాపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ.
తగ్గేదేలే.. పుష్ప చిత్రంలోని ఈడైలాగ్ ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకు వెయ్యి ఎనుగుల బలం ఇచ్చేలా తయారైంది. అచ్చం పుష్ప సినిమా తరహాలోనే ఇప్పుడు ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగిస్తూ ఎర్ర బంగారాన్ని అడ్డంగా దోచేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానందిలో వెలుగు చూసిన ఓ ఘటన ఇందుకు నిలువెత్తు సాక్షంగా నిలుస్తోంది.
నల్లమల ఫారెస్ట్‌లో ఎర్ర దొంగలు రెచ్చిపోతున్నారు. అదును చూసి అమూల్యమైన ప్రకృతి సంపదను కొల్లకొడుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనాన్ని దేశ, విదేశాలకు అక్రమంగా తరలిస్తూ రాత్రికి రాత్రే కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో ఎర్రచందనం కూలీల అరెస్ట్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోది. తమిళనాడుకు చెందిన 15 మంది కూలీలను నంద్యాల జిల్లా మహానంది పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నల్లమల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకే వీరంతా వచ్చినట్లు విచారణలో బయటపడింది. పక్కా ప్లాన్‌తో భక్తుల రూపంలో మహానంది దేవస్థానంలోని టీటీడీ వసతి గృహంలో బస చేసినట్లు మహానంది సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు.
నల్లమల ఫారెస్ట్‌లో అరుదుగా దొరికే ఎర్రచందనానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీన్నే అదునుగా భావించిన తమిళనాడుకు చెందిన మదన్ మోహన్ అనే ఎర్ర చందనం స్మగ్లర్ దాన్ని కొల్లగొట్టేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు. ఇందుకోసం గిద్దలూరుకు చెందిన మౌలాలీ, తిరుపతికి చెందిన జయరాంతో చేతులు కలిపాడు. అయితే శేషాచలం అడవులకు మాత్రమే పరిమితమైన తమిళకూలీలను రంగంలోకి దించితే ప్లాన్ సక్సెస్ అవుతుందని భావించాడు. ఇక ప్లాన్‌ను అమలు చేద్దామనుకునేలోపు ఈ సమాచారం పోలీసులకు లీకైంది. వెంటనే అలెర్ట్ అయిన స్పెషల్ టీం నంద్యాలను జల్లెడ పట్టగా మహానంది క్షేత్రంలో భక్తుల అతిధి గృహంలో బసచేసిన ఎర్రకూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరి గుట్టు రట్టైంది. అసలు నల్లమల అడవుల్లో ఎర్ర చందనం చెట్లను ఎలా సీక్రెట్‌గా నరుకుతున్నారు..? వాటిని ఎక్కడకు పంపుతున్నారు..? ఎక్కడ నిల్వ చేస్తున్నారు అన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఎర్రచందనంచోరీ, తరలింపు వ్యవహారంలో స్మగ్లర్లు పుష్ప సినిమాను కాపీకొడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా కొత్త ప్లాన్లను అమలు చేస్తూ ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలిస్తున్నారు. ఈ బిజినెస్‌లో కొంతమంది పొలిటికల్ లీడర్స్ హస్తం కూడా ఉన్నట్లు తేలింది. వారి మద్దతుతోనే ఎక్కడా తనిఖీల్లో పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. నల్లమలలో ఉన్న ఎర్ర బంగారం సంపదను రక్షించుకోవాలని విపక్ష నేతలు, స్థానికులు కోరుతున్నారు. ఎర్రచందనం దొంగలకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.