Ram Nath Kovind: విశాఖలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

Ram Nath Kovind: స్వాగతం పలికిన గవర్నర్‌ బిశ్వభూషణ్, సీఎం జగన్.

Update: 2022-02-21 03:17 GMT

Ram Nath Kovind: విశాఖలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

Ram Nath Kovind: నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ సాగర తీరం సిద్ధమైంది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టాలకు విశాఖలోని తూర్పు నౌకాదళం ఆతిథ్యమిస్తోంది. ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్‌ – 2022 కు ఏర్పాట్లు చేసింది. ఈ రెండు ప్రతిష్టాత్మక విన్యాసాల కోసం నౌకాదళం చేస్తున్న రిహార్సల్స్‌తో విశాఖ సాగర తీరం సందడిగా మారింది.

భారత నౌకాదళం మొత్తం విశాఖ పైనే దృష్టి సారించింది. ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూ పనుల్లో ఉన్నతాధికారులంతా నిమగ్నయ్యారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కీలకమైన యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, హెలికాప్టర్లు, కోస్టుగార్డ్‌, ఇంకా సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే ఇతర సంస్థల నౌకలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు 44 నౌకలు నడిసముద్రంలో నాలుగు వరుసల్లో కొలువు దీరనున్నాయి. ఇక ప్రత్యేకంగా అలంకరించిన భారత గస్తీ నౌక 'INS సుమిత్ర'లో రాష్ట్రపతి వాటి మధ్యగా వెళుతూ, ఆ నౌకల సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. సుమారు 2గంటల పాటు సాగే ఈ సమీక్ష కనులపండువగా ఉంటుంది.

భారత సర్వ సైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతి తన ఐదేళ్ల పదవీ కాలంలో ఓసారి నౌకాదళ సమీక్ష చేస్తారు. ఇప్పటివరకు 11 సమీక్షలు జరగ్గా, ఇది పన్నెండోది. విశాఖలో మూడోది. 2016లో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష కూడా విశాఖలోనే నిర్వహించారు. నౌకాదళ సమీక్షకు రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఓ నౌకను ముస్తాబు చేయడం ఆనవాయితీ. దానిపేరు INS సుమిత్ర. ఇది గస్తీ నౌక. సముద్ర పరీక్షలు పూర్తయ్యాక 2014 సెప్టెంబరులో దళంలో చేరింది. ఇది తూర్పు నౌకాదళంలో పనిచేస్తుంది. 

Tags:    

Similar News