కాసేపట్లో ఏపీకి ప్రధాని మోడీ.. గన్నవరం ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకనున్న సీఎం జగన్
భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని
Narendra Modi: కాసేపట్లో ప్రధాని మోడీ ఏపీకి రానున్నారు. ఉదయం 10గంటల 50 నిమిషాలకు హెలికాప్టర్‌లో భీమవరానికి ప్రధాని మోడీ బయలుదేరుతారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ప్రధాని రాకతో భీమవరంలో సందడి వాతావరణం నెలకొంది. అజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు.
విగ్రహా ఆవిష్కరణ అనంతరం పెదమీరంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధాని హాజరుకానున్నారు. బహిరంగసభలో మోడీతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే బహిరంగ సభ ఏర్పాట్లకు వర్షం అడ్డంకిగా మారింది. అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షంతో సభ ప్రాంగణం వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. మరోపక్క వాహనాలకు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలు బురదతో నిండిపోయాయి. సభా ప్రాంగణం వద్ద చేరిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా బయటికి పంపించే ఏర్పాట్లు చేశారు.
మోడీ టూర్ నేపథ్యంలో భీమరం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 3వేల మందితో భారీ భద్రత ఏర్పాటుచేశామని ఏలూరు రేంజ్ డీఐజీ తెలిపారు. పలువురు వాలంటీర్స్ ని ట్రాఫిక్ నియంత్రించేందుకు ఉపయోగిస్తాం అన్నారు. సభా ప్రాంగణానికి వచ్చేవారు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని ఆయన సూచించారు. మోడీ పర్యటన ఆటంకాలు లేకుండా జరగడానికి అంతా సహకరించాలన్నారు సభకు 60వేల మంది హాజరవుతారని అంచనా వేశామన్నారు.
మోడీ పాల్గొనే వేదికపై 11మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ప్రధాని, గవర్నర్, కేంద్రమంత్రి, సీఎం జగన్‌తో పాటు మరో ఏడుగురు వేదికపై కూర్చోనున్నారు. ఇక వేదిక సమీపంలో వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు సభలో ప్రత్యేక స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి సెల్ ఫోన్లకు అనుమతి లేదు. పోలీసులు ముందస్తుగానే హైసెక్యూరిటీ జామర్లను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ అనంతరం ప్రధాని మోడీ మధ్యాహ్నం 12గంటల 25 నిమిషాలకు భీమవరం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.