Pinakini Satyagraha Ashram: చారిత్రక చిహ్నంగా 'పినాకిని ఆశ్రమం'
Pinakini Satygraha Ashram: 1927 ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించారు.
Pinakini Satygraha Ashra: అది మహాత్ముడు నడియాడిన నేల.. స్వాతంత్ర్య సమరయోధుల స్పర్శతో పులకించిన పుణ్యభూమి.. సమర యోధుల్లో స్ఫూర్తిని రగిల్ఛి.. స్వేచ్ఛా కాంక్షకు ఊపిరులూదిన పురిటిగడ్డ. అదే ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం.., నేడు ఓ చారిత్రక చిహ్నంగా మారింది. అడుగడుగునా బాపూజీ జ్ఞాపకాలతో మురిపిస్తూ.. నాటి స్వాతంత్ర్య స్ఫూర్తిని, దీప్తిని ఎలుగెత్తి చాటుతోంది. ఇది నెల్లూరు జిల్లా పల్లిపాడు విలేజ్ లో వుంది.
1927 ఏప్రిల్ 7న పినాకిని ఆశ్రమం ప్రారంభం
1927 ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించారు. చెప్పాలంటే ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు అప్పట్లో ఈ ఆశ్రమం వేదికైంది. అంతేకాదు రాట్నం చప్పుళ్లు, ఖద్దరు కళ, గీతా పారాయణం తదితరాలతో మార్మోగింది. తర్వాత ఆశ్రమ నిర్వాహకులు జైలుకెళ్లడంతో ఖాదీ ఉత్పత్తి ఆగిపోయింది. అయితే కాలగమనంలో శిథిలావస్థకు చేరిన ఆశ్రమ బాధ్యతలు రెడ్‌క్రాస్‌కు అప్పగించడంతో పునరుజ్జీవం లభించింది.
ఆశ్రమ బాధ్యతలు రెడ్‌క్రాస్‌కు అప్పగింత
1918లో దిగుమూర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకట కృష్ణయ్య, కొండపర్తి పున్నయ్య నెల్లూరుకు 11 కిలోమీటర్ల దూరంలో పెన్నానదీ తీరాన కొంతస్థలం తీసుకుని కుటీరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు పొణకా కనకమ్మ 13 ఎకరాల నీలిమందు తోటలను కొనుగోలు చేసి ఆశ్రమ విస్తరణకు బహూకరించారు. పొణకా సుబ్బరామిరెడ్డి, పట్టాభి రామిరెడ్డి కుటీరాలు వేసి పర్ణశాల నిర్మించి ఆశ్రమానికి రూపమివ్వగా, ప్రారంభవేడుకల్లో బుచ్చి కృష్ణయ్య, కాసా సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమానికి రుస్తుంజీ రూ.10వేలు విరాళం
ఇక గాంధీజీ సన్నిహితుడు రుస్తుంజీ ఆశ్రమానికి 10వేల రూపాయలు విరాళంగా ఇవ్వడంతో ప్రధాన భవనానికి రుస్తుంజీ భవనంగా పేరు పెట్టారు. 1925లో భవనం పూర్తి కాగా 2005లో ఆశ్రమాన్ని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అప్పగించారు. చెప్పాలంటే శిథిలావస్థకు చేరిన రుస్తుంజీ భవనాన్ని పున:నిర్మించడానికి అప్పటి కలెక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ గాంధీజి ఆశయాలపై యువతకు ప్రేరణ కల్గిస్తూ ఆయన జ్ఞాపకాలను పదిలపరుస్తూ సేవా, ప్రచార కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది. మొత్తానికి పవిత్ర పినాకిని తీరంలోని విశాలప్రాంగణంలో పచ్చనిచెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈఆశ్రమం అలరారుతోంది. యోగ ముద్రలో కూర్చొని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.