Penalties to Control Coronavirus: ఇక నుంచి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కొరడా.. కరోనా నియంత్రణలో పెనాల్టీ వేసేందుకు సిద్ధం
Penalties to Control Coronavirus: ఇప్పటివరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు ఫైన్లు వేస్తుంటే ఇక నుంచి మున్సిపల్..
Penalties to Control Coronavirus: ఇప్పటివరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు ఫైన్లు వేస్తుంటే ఇక నుంచి మున్సిపల్, రెవెన్యూ అధికారులకు భాద్యతలు అప్పగించారు. వీరు ఇక నుంచి భాద్యతగా వ్యవరిస్తున్న వారిపై కొరడా ఝుళిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇళ్ల నుంచి బయటికి వచ్చినప్పుడు మాస్క్ ధరించకుంటే ఇప్పటి వరకూ పోలీసు, రెవెన్యూ శాఖలు మాత్రమే జరిమానాలు విధిస్తున్నాయి. ఇకపై మున్సిపల్ అధికారులు కూడా ఆ బాధ్యత తీసుకోనున్నారు! భౌతికదూరం పాటించకున్నా జరిమానాల మోత మోగించనున్నారు! అంతేకాకుండా.. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి దుకాణంలో థర్మల్ స్కానర్లు, శానిటైజర్ల వాడకాన్ని తప్పనిసరి చేసి, పాటించని వారికి నోటీసుల జారీ, పెనాల్టీలు, దుకాణాల మూసివేత వంటి చర్యలు తీసుకుంటారు.
మాస్క్ లేకుండా కనిపించారో...
కరోనా ఉధృతి మరింత ఎక్కువగా ఉన్న దృష్ట్యా పురపాలకశాఖ 'అన్‌లాక్-2.0 కార్యాచరణ ప్రణాళిక'ను సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో తక్షణమే ఇది అమల్లోకి రానుంది. నిత్య పర్యవేక్షణ ద్వారా కరోనా కట్టడి నియమావళిని అతిక్రమించే వారిని ఎప్పటికప్పుడు గుర్తించి, అపరాధ రుసుములు విధించడం సహా వివిధ చర్యలు తీసుకోనుంది. ఈ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యతను మున్సిపల్ కమిషనర్లపై ఉంచారు. ఈ అంశాలపై ప్రతి రోజూ నివేదికలను సమర్పించాల్సిందిగా కమిషనర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రపరచుకోవడం తదితరాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నారు. ఇకపై ఎవరన్నా మాస్క్ లేకుండా కనిపిస్తే పురపాలక అధికారులే జరిమానా విధిస్తారు.
దుకాణదారులు పాటించాల్సినవి..
కరోనా వ్యాప్తిలో చిన్న దుకాణాలూ కీలక పాత్ర పోషిస్తున్నాయని భావిస్తున్న ఉన్నతాధికారులు ఇకపై అన్ని దుకాణాల్లోనూ, బయట కొనుగోలుదారులూ కచ్చితంగా 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా వ్యాపారులు చూడాలి. ఇందుకోసం వృత్తాలు లేదా గడులు తప్పనిసరిగా గీయించాలి. వార్డు మహిళా, వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు ప్రతి రోజూ తమకు కేటాయించిన ప్రాంతాల్లోని దుకాణాలన్నింటినీ పరిశీలించి, నిబంధనలు పాటించని వ్యాపారులపై మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయాలి.
నిర్మాణ ప్రదేశాల్లో ఇవీ నిబంధనలు..
నిర్మాణ స్థలాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ప్రతి ఒక్కరికీ కచ్చితంగా థర్మల్ స్ర్కీనింగ్ జరపడంతోపాటు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. పై అంతస్థులతోపాటు కామన్ ఏరియాల్లోనూ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ఈ ప్రదేశాల్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. బయటి నుంచి సామగ్రి తెచ్చే కార్మికులు చేతి గ్లవుజ్‌లు వాడేలా చూడాలి. గుట్కా, తంబాకు, కిళ్లీల వంటివి ఉమ్మి వేయడం పూర్తిగా నిషిద్ధం. పర్యవేక్షణ కమిటీల్లో సభ్యులైన వైద్యులు కనీసం వారానికోసారి సైట్‌ను సందర్శించి, అవసరమైన వారికి వైద్య సహాయాన్ని అందించాలి.
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు..
వర్షాకాలంలో సోకే వివిధ వ్యాధులను నివారించేందుకు మురికివాడలు, కార్యాలయాలు, కమ్యూనిటీ టాయ్‌లెట్లు, బహిరంగ స్థలాలు వంటి వాటిని తరచూ డిస్‌ఇన్ఫెక్ట్ చేస్తుండాలి. ఇంటి నుంచి వ్యర్థాల సేకరణ సంపూర్ణంగా జరిగేలా, గృహస్తులే తడిచెత్తను వేరు చేసేలా చూడాలి. దోమల నివారణకు యాంటీ లార్వా మందును పిచికారి చేయించడంతోపాటు సెప్టిక్ ట్యాంక్ పైపుల పైభాగాన నెట్లు కట్టాలి. గుర్తించిన వార్డుల్లో నిత్యం ఫాగింగ్ చేయాలి. డ్రైనేజీ వ్యవస్థ సజావుగా ఉండేలా చూడాలి.