Pawan Kalyan: నేటి నుంచే పవన్ వారాహి యాత్ర

Pawan Kalyan: అన్నవరం సత్యదేవుని దర్శనమనంతరం యాత్ర ప్రారంభం

Update: 2023-06-14 03:46 GMT

Pawan Kalyan: నేటి నుంచే పవన్ వారాహి యాత్ర

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచే మొదలుకాబోతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. ప్రత్యేకంగా రూపొందించిన వారాహి వాహనంలో చేస్తున్న యాత్రకు 'జనసేన వారాహి విజయ యాత్ర' అని పేరు పెట్టారు. కాసేపట్లో అన్నవరం సత్యదేవున్ని దర్శించుకోనున్నారు పవన్ కల్యాణ్. అనంతరం వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది జనసేన. ఈ యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో చారిత్రాత్మక కార్యక్రమానికి పవన్ కీలక అడుగులు వేయనున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా జనసేన పార్టీ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే వారాహి వాహనాన్ని ఉభయ గోదావరి జిల్లాల వేదికగా విజయ యాత్ర చేపట్టారు పవన్ కల్యాణ్. కత్తిపూడి బహిరంగ సభలో పవన్ మొదటి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే సార్వత్రికి ఎన్నికల నాటికి సంబంధించి పవన్ ఏం మాట్లాడుతారన్నది సస్పెన్స్‌గా మారింది.

కత్తిపూడి నుంచి వారాహి విజయ యాత్ర ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరనుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో వారాహి యాత్ర అనంతరం సభ నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. యాత్ర దిగ్విజయానికి పార్టీ నేతలు కమిటీలు కూడా నియమించారు.

Tags:    

Similar News