రణరంగాన్ని తలపిస్తున్న దివీస్.. ఎట్టకేలకు పవన్ పర్యటన కు షరతులతో అనుమతి
తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తొండగి మండలంలో ఉన్న దివీస్ లేబరేటరీస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ ఫార్మా సంస్ధ విస్తరణ కోసం కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలను స్ధానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నయిమ్ అస్మి స్పష్టం చేశారు.
దిగ్గజ ఫార్మా కంపెనీ దివీస్‌కు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్యమిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఏర్పాటౌతున్న దివీస్ ఫార్మా పరిశ్రమ వద్దంటున్న స్థానిక ప్రజలకు మద్దతు పలికేందుకు పవన్ కళ్యాణ్ రేపు తునిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తుని చేరుకోనున్న జనసేనాని దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. పవన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతిచ్చారు పోలీసులు.