Pawan kalyan: విజయ్‌ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ట్వీట్.. ఆయనేమన్నారంటే..
Pawan kalyan congratulates Vijay: తమిళ వెట్రి కళగం పేరిట పార్టీని స్థాపించి విల్లుపురం బహిరంగ సభతో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో విజయ్‌కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియచేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. సాధువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినందుకు.. తిరు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. విజయ్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు విజయ్ కూడా పవన్‌పై ప్రశంసలు కురిపించారు. భారీ విజయం సాధించి, జనసేన పార్టీని ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిపినందుకు పవన్ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో మీరు చూపించిన ఓర్పు, అంకితభావం అభినందనీయం అంటూ పోస్ట్ చేశారు. అలాగే చంద్రబాబుని కూడా అభినందిస్తూ.. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. మీ లీడర్‌షిప్‌లో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. చూస్తుంటే విజయ్‌కి పవన్‌తో పాటు చంద్రబాబు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మనదేశంలో రాజకీయాలకు, సినీ తారలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన వాళ్లలో కొంతమంది రాజకీయాల్లోనూ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అదే బాటలో విజయ్ దళపతి కూడా నడుస్తున్నారు. తాజాగా తమిళనాడులో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.
ఏ ఇండస్ట్రీలోనైనా ఒక స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని, ఎంతో పోటీని తట్టుకొని నిలబడగలగాలి. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇళయ ధళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కి ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో.. తమిళ్‌లో విజయ్‌కు కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటారు.
పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి రాజకీయాలలోకి వచ్చి పదేళ్ల పాటు ఎంతో కృషి చేశారు. 2024 ఎన్నికలలో అఖండ విజయం సాధించి డిప్యూటీ సీఎం పదవిని అందుకున్నారు. అయితే ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆయన కూడా తమిళ రాజకీయాలలో సరికొత్త మార్పు తీసుకురావాలని చూస్తున్నారు. అయితే అక్టోబర్ 27న తన పార్టీ మొదటి బహిరంగ సభ పెట్టి తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. విజయ్ పార్టీ బహిరంగ సభకు 5 లక్షలకు పైగా జనాభా వచ్చినట్టు సమాచారం.
విజయ్ దళపతి 2024 ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీని స్థాపించారు. తాజాగా బహిరంగ సభ ద్వారా తన పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏం చేయబోతున్నామో అనే విషయాల్సి తెలియజేశారు. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు.
స్టార్ హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తాను సినిమాను వదిలేసి మరీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చనని విజయ్ చెప్పుకొచ్చారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తమిళ రాజకీయాలను తారుమారు చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎలాంటి ఫలితాలు సాధిస్తారో వేచి చూడాలి మరి.