Guntur: గుంటూరు జిల్లాలో చమురు కొరత

*అడ్వాన్స్ చెల్లిస్తేనే ఆయిల్ సరఫరా చేస్తామంటున్న కంపెనీలు

Update: 2022-06-04 04:15 GMT

గుంటూరు జిల్లాలో చమురు కొరత

Guntur: ఆయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకడంతో బంకుల నిర్వహణ కూడా గగనమైంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పెట్టుబడి రెట్టింపు కావడంతో డీలర్లు సమస్యల సుడిలో చిక్కుకుపోయారు. పోటీ, అప్పుల భారం పెరగడంతో చాలామంది బంకు నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా గత మూడు నెలలుగా గుంటూరు జిల్లాలోని చాలా బంకుల్లో పెట్రోల్‌ దొరకడం లేదు. మరోవైపు ఇటీవల కేంద్ర భుత్వం ఆయిల్‌ రేట్లు తగ్గించడంతో అమ్మకాలు తగ్గించాలని తమపై కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గడిచిన కొన్ని నెలలుగా కొన్ని పెట్రోల్‌ బంకులకే పరిమితమైన 'నో స్టాక్‌' అన్న మాట ఇప్పుడు అన్ని బంకుల్లో ప్రతిధ్వనిస్తోంది. నిన్నటి వరకూ పెట్రోలుకే పరిమితమైన ఈ మాట ఇప్పుడు డీజిల్‌కు కూడా వర్తిస్తోంది. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో మూడొంతులు నో స్టాకుతో కనిపించాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చింది. పెట్రోల్‌ లేని కారణంగా కార్లు, మోటార్‌ సైకిళ్లు ఉన్న వాహనదారులు ఇబ్బందులకు గురవగా, గత రెండు రోజుల నుంచి డీజిల్‌ కూడా లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లు, టాటా మ్యాజిక్‌, సిటీ బస్సులు వంటి ప్రైవేటు రవాణా కూడా దెబ్బతింది. ఫలితంగా రవాణా సదుపాయాలు లేక ప్రయాణికులు, బతుకుతెరువు కరువై వాహనదారులు నానా అగచాట్లు పడుతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 400 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిలో 179 గుంటూరు జిల్లాలోనూ, మిగిలిన 221 బంకులు పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా పెట్టుబడి రెట్టింపు కావడంతో డీలర్లు సమస్యల సుడిలో చిక్కుకుపోయారు. దీంతో నిర్వాహకులు ఆయిల్‌ కంపెనీల వద్ద భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. ఆయిల్‌ ధరతో పాటు కమీషన్‌ పెరగకపోవడంతో గడిచిన కొద్దికాలంలోనే ఒక్కో బంకు నిర్వాహకుడు ఆయిల్‌ కంపెనీకు 30 నుంచి 40 లక్షల రూపాయల మేర బకాయి పడ్డాడు. నూటికి రూపాయిన్నర చొప్పున వడ్డీ కడుతున్నాడు. దీనికి తోడు జిల్లాలో షెల్‌, రిలయన్స్‌, ఎస్సార్‌ వంటి ప్రైవేటు పెట్రోల్‌ బంకులు 50 వరకూ తెరిచారు. వీటి పోటీలో డీలర్లు బాగా దెబ్బతిన్నారు. ఫలితంగా గత మూడు నెలలుగా జిల్లాలోని చాలా చోట్ల బంకుల్లో పెట్రోల్‌ దొరకడం లేదు. 

గత కొంత కాలంగా ఆయిల్‌ రేట్లు పెరగడంతో అమ్మకాలను ప్రోత్సహించిన కంపెనీలు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ రేట్లు తగ్గించడంతో అమ్మకాలు తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఒక్కో లీటరుపై 25 రూపాయలు నష్టం వస్తోందని, అమ్మకాలు తగ్గించాలని ఒత్తిడి చేయడంతో పాటు ఆయిల్‌ సరఫరాను ఆపేశారు. తమకు డీలర్లు బకాయి పడిన 30, 40 లక్షలు చెల్లించడంతోపాటు మరో 20 లక్షల రూపాయలు అడ్వాన్స్‌ పేమెంట్‌ కింద ముందుగా చెల్లిస్తేనే ఆయిల్‌ సరఫరా చేస్తామని ఆయిల్‌ కంపెనీలు కొత్త మెలిక పెట్టాయి. దీంతో పాటు కొత్తగా రేషనింగ్‌ విధానాన్ని ముందుకు తెచ్చాయి. ఈ విధానాన్ని అధికారికంగా అమలులోకి తెచ్చిన భారత్‌ పెట్రాలియం కార్పొరేషన్‌ సంస్థ ఎంత ఇండెంట్‌ పెట్టుకున్నా నిర్ణయించిన కోటా మేరకే బంకులకు ఆయిల్‌ పంపుతోంది. దీంతో అవన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇదే విధానాన్ని హెచ్‌పీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లు కూడా అనధికారికంగా అమలు చేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. కంపెనీల ఒత్తిడితో బంకు డీలర్లు నిరసనకు దిగారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News