good news ration card holders : బియ్యం కార్డుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇకనుంచి..
ఏపీలో రెవెన్యూశాఖ మంత్రిగా.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఆయన తొలి సంతకం చేశారు. అంతేకాకుండా బియ్యం కార్డుదారులకు కూడా మంత్రి ధర్మాన శుభవార్త అందించారు. ఇకనుంచి బియ్యం కార్డు ఉన్న వారికి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. బియ్యం కార్డునే ఇన్‌కమ్ సర్టిఫికేట్ గా గుర్తించనున్నట్టు వెల్లడించారు. ఇక భూవివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఫ్రెండ్లీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం భూమిని రీ సర్వే నిర్వహించి రికార్డులను నవీకరించనునట్లు తెలిపారు..
ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగానే తమ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించిన మంత్రి ధర్మాన.. రెవెన్యూ సేవలు గ్రామస్థాయి నుంచే ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్న ధర్మాన.. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయని అన్నారు. రెవెన్యూలో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిగేందుకు కృషి చేస్తానని మంత్రి ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.