ఆ చీటర్ లవర్ రూటే వేరు ముందు అమ్మాయిల సెల్ నెంబర్ ఆపై ప్రైవేట్ ఫోటోల కలెక్షన్. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ షురూ. ఇంతేనా ప్రేమ వ్యవహారంలో ఉన్న వారినీ ఒదిలిపెట్టడు. రెండు వైపులా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుంటాడు. ఇలా అమ్మాయిల జీవితాలతో ఆటాడుకుంటున్న ఓ చీటర్ కు దిశా పోలీస్ సిబ్బంది కీలెరిగి వాతపెట్టారు అదెలా అనుకుంటున్నారా ఈ స్టోరీ చూడండి.
ఈ యువకుడి పేరు ప్రశాంత్. ఎమ్మెస్సీ చదువుకున్న ఇతడు ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. మాయ మాటలతో అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. స్నేహితుల ద్వారా అమ్మాయిల సెల్ ఫోన్ నెంబర్ సంపాదిస్తాడు ప్రశాంత్. సోషల్ మీడియాలో అమ్మాయిలకు ముందుగా తాను బ్రదర్, ఫ్రెండ్ , వెల్ విషర్ పేరిట అంటూ మాటలు కలుపుతాడు. ఇతడి వలలో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన అమ్మాయి పడింది. పదే పదే రిక్వెస్టు మేరకు తన ప్రైవేట్ ఫోటోను షేర్ చేసింది. నీవు లేదా నీ చెల్లెలు నాతో గడపాలి లేకుంటే సోషల్ మీడియాలో ఫోటో పెట్టి అల్లరి చేస్తానని భయపెట్టాడు.
ప్రశాంత్ తీరుతో షాక్ తిన్న అమ్మాయి నెల్లూరు దిశా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రశాంత్ ప్రవర్తన పోలీసులకు షాక్ కలిగించింది. అమాయక అమ్మాయిలనే కాదు ప్రేమలో వున్న అమ్మాయిల వివరాలను తెలుసుకొని వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇలా పలువురిని లోబర్చుకున్నాడు. తనకు లొంగిపోయిన అమ్మాయితో మరో అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఇలా చైన్ తరహాలో అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాడు. తిరుపతి, కావాలి, గూడూరు, నెల్లూరుతో పాటు పలుచోట్ల బాధితులు వున్నారు.
టెన్త్ నుంచి ఎమ్మెస్సీ చదువుకుంటున్న అమ్మాయిల గ్రూప్ లలో ఈ మోసగాడు వున్నాడు. మాయమాటలతో, బ్లాక్ మెయిలింగ్ తో లొంగదీసుకుంటున్నాడు. ఇతడి మాటల్ని గుడ్డిగ నమ్మిన ఓ అమ్మాయి యూ ఆర్ గ్రేటెస్ట్ లవర్ ఆన్ ద ఇర్త్ అని పొగిడిందట. ఇలాంటి వెధవలను, రాక్షసులను అమ్మాయిలు ఎలా నమ్ముతున్నారు అని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం పరిచేయం లేనివారికి ప్రైవేట్ ఫోటోలు ఎలా పంపిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోవద్దని సూచిస్తున్నారు.
సోషల్ మీడియా పరిచయాల్లో ఎన్నో ఘోరాలు, నేరాలు చూస్తున్నామని కానీ జనం తీరు మారడంలేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ‌్యంగా సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. ప్రశాంత్ లాంటి మోసగాళ్లు సమాజంలో ఎందరో ఉన్నారని, అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.