Andhra Pradesh: దొంగగా మారిన నేవీ ఉద్యోగి…అరెస్టు
Andhra Pradesh: గోపాలపట్నం సమీపంలో ఉన్న శ్రీ జ్యుయెల్లరీ షాపులో చోరీకి పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు.
Andhra Pradesh: ఉమ్మడి కుటుంబం, ప్రేమ వివాహం, నేవీలో ఉద్యోగం. ఇంకేంటి ఇబ్బంది మంచి లైఫ్ కదా అనుకుంటున్నారా. అదేనండి అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో నేటి యువత అనేక పెడదోవలు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా ఈ నేవీ ఉద్యోగి షేర్ మార్కెట్ అలవాటు అతడిని తప్పుడు మార్గం వైపు పయనించేలా చేశాయి. పర్యవసానంగా ఓ జ్యుయెల్లరీ షాపులో చోరీకి పాల్పడ్డా డు. పెళ్లినాడు భర్త అడుగుజాడల్లో నడుస్తానని చేసిన ప్రమాణాన్ని పాటిస్తూ భార్య కూడా అతడికి సహకరించింది. చివరికి పథకం బెడిసికొట్టి దంపతులిద్దరూ పోలీసులకు చిక్కారు.
బీహార్‌కు చెందిన రాజేష్ ఇండియన్ నేవీలో సైలర్‌గా పనిచేస్తూ విశాఖపట్నంలో నివాసముంటున్నాడు. అమ్రిత పూనమ్ అనే యువతిని ప్రేమించి కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రాజేష్ కుటుంబం చాలా పెద్దది. తల్లిదండ్రులకు అతడితో కలిసి ఏడుగురు సంతానం. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు, కుటుంబ పోషణ అంతా అతడి మీదే పడటంతో సుమారు రూ.10లక్షల వరకు అప్పులయ్యాయి. దీనికి తోడు షేర్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మరింత నష్టపోయాడు. ఈ క్రమంలోనే అతడికి విశాఖ నుంచి ముంబైకి బదిలీ అయింది.
ఈ నేపథ్యంలోనే అప్పుల బాధ తప్పించుకునేందుకు రాజేష్ తన భార్యతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. గోపాలపట్నం సమీపంలో ఉన్న శ్రీ జ్యుయెల్లరీ షాపులో చోరీకి పాల్పడ్డాడు. 4.50 కిలోల వెండితో పాటు 90 వేల నగదు, మరికొన్ని బంగారు నగలు చోరీ చేశాడు. దోచుకున్న సొత్తును ఇంటికి తీసుకెళ్లకుండా ఎయిర్‌పోర్ట్ సమీపంలోని పొదల్లో దాచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా రాజేష్, అతడి భార్యే సూత్రధారులను తేల్చి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇటు ఉద్యోగానికి ఎసరుతో పాటు ఉన్నపొరువు కాస్తా పోయే.