ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పుట్టిస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నేపథ్యలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో జగన్ రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ నేత సుధాకర్ రెడ్డి ఎన్నికల్లో వైసీపీకి ఓటు వెయ్యకపోతే కాళ్లు విరగ్గొడతా అంటూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ నాయకుల బెదిరింపులు పోలీసులకు మాత్రం వినపడవు, కనపడవు అని లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచి మూర్ఖంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీస్ శాఖకు లేదా? అని ప్రశ్నించారు లోకేశ్.