Nara Lokesh comment: సిక్కోలు టీడీపీలో కొత్త రచ్చ.. మంటలు రేపిన లోకేష్ మాటలు
బాబాయ్-అబ్బాయ్. ఒకరంటే ఒకరికి ప్రేమ, అభిమానం, ఆప్యాయత. రాజకీయంగానూ గొడవల్లేవు. బాబాయ్ అరెస్టు అయినప్పుడు, దిక్కులు పిక్కటిల్లేలా గొంతు విప్పారు అబ్బాయి. మా చిన్నాన్ననే అరెస్టు చేస్తారా అంటూ కళ్లెర్రజేశారు. రాష్ట్రమంతా, బాబాయ్‌కు సానుభూతి వెల్లువెత్తిందని, పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇప్పుడదే అబ్బాయికి ఎక్కడో గుచ్చుకుంటోందట. రాబోయే కాలంలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ యుద్దం తప్పదేమోనన్న చర్చ కూడా జరుగుతోందట. కొడుకు-చిన్నాన్న మధ్య పరోక్షంగా చిచ్చు రగిలించిన మాటలు ఎవరివో తెలుసా లోకేష్ బాబు. ఇంతకీ ఎవరు బాబాయ్ ఎవరు అబ్బాయ్ లోకేష్ కామెంట్స్ ఏంటి?
ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు త్వరలోనే ఉండబోతోందా అంటే అవుననే చెప్పాలి. ఈ విషయాన్ని ఎవరో కాదు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా చెప్పారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వుంటుందన్న లోకేష్ మాటలు, ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు లోకేష్. ఇంకేముంది సిక్కోలు తెలుగు తమ్ముళ్లలో కొత్త చర్చ ప్రారంభం అయ్యిందట. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికీ దక్కుతుంది అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.
శ్రీకాకుళం జిల్లా నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. దీనిపై వైసిపి కీలక నేత విజయసాయి రెడ్డి అప్పట్లో చేసిన ఓ ట్వీట్ పెద్ద రచ్చే చేసిందట. విజయసాయి ట్వీట్ తర్వాత సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు సైతం రామ్మోహన్ నాయుడే ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారట. దీనికి సంబంధించి రామ్మోహన్ నాయుడుకి అనుకూలించే అంశాలతో పెద్దపెద్ద పోస్టులు పెడుతూ వారు చేసిన హడావుడి అంతాఇంతా కాదు.
ముఖ్యంగా మంచి వాక్చాతుర్యం, అనర్గళంగా మాట్లాడటంతో పాటు జిల్లాలో భారీగా యువత ఫాలోయింగ్ ఉండటం రామ్మోహన్ నాయుడుకి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తండ్రి లాగే రామ్మోహన్ నాయుడు సైతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగు వారి బాణీని వినిపిస్తున్నారంటూ చంద్రబాబే అనేక సందర్భాల్లో మెచ్చుకున్నారు. లోకేష్‌కు రామ్మోహన్ అత్యంత సన్నిహితుడు కూడా. ఇవన్నీ కలగలపి రామ్మోహన్ నాయుడుకే రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయని జిల్లా టిడిపి వర్గాల్లో సైతం అప్పట్లో పెద్ద చర్చ జరిగిందట. కానీ తాజాగా కొన్ని పరిణామాలు, ఈ చర్చను మరింత మంటెక్కిస్తున్నాయట.
తాజాగా పరిస్థితులు మారినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్టు అవడం, ఆయనకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరగడంతో సీన్ ఒక్కసారిగా మారిందట. అధ్యక్ష రేసులోకి అచ్చెన్నాయుడు పేరు చేరిందనే చర్చ మొదలయ్యిందట. ప్రధానంగా అచ్చెన్నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలుగుదేశం ప్రచారం చేయడంతో, ఆయనపై ప్రజల్లో సింపతీ పెరిగిందనే చర్చ జరుగుతోందట. అసెంబ్లీలో సైతం ప్రభుత్వంపై ఒంటి కాలితో అచ్చెన్నాయుడు ఎగిరెగిరి పడుతుండటంతో చంద్రబాబు తర్వాత అచ్చెన్నాయుడే ధీశాలి అనే టాక్ పార్టీలో ఉందట. ఈ నేపథ్యంలో, అచ్చెన్నకొచ్చిన సానుభూతి, ఆయన అరెస్టుతో టీడీపీ శ్రేణుల్లో వెల్లువెత్తిన ఆవేశకావేశాలు కంటిన్యూ కావాలంటే, అచ్చెన్నాయుడే రాష్ట్ర అధ్యక్షుడు అయితే బాగుంటుందని, ఒకవర్గం గట్టిగా భావిస్తూ, చంద్రబాబుకు సలహాలిస్తోందట. దీంతో స్టేట్ ప్రెసిడెంట్ రేసులో వున్నాడనుకున్న రామ్మోహన్ నాయుడు వర్గంలోనూ ఒక్కసారిగా నైరాశ్యం మొదలైందట. బాబాయ్-అబ్బాయ్ మధ్య అనుకోకుండా, వివాదం వచ్చిపడినట్టయ్యిందన్న చర్చ సిక్కోలులో జరుగుతోందట.
రామ్మోహన్‌కే రాష్ట్ర పార్టీ పగ్గాలు దాదాపు ఖరారు అయిపోయింది అని భావిస్తున్న తరుణంలో, అనూహ్యంగా అచ్చెన్నాయుడు పేరు తెరపైకి రావడంతో ఇద్దరి మధ్య వార్‌గా మారుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందట. అంతేకాకుండా ఇప్పటికే ఇరు వర్గీయుల మధ్య ఈ అంశంపై విభేదాలు మొదలయ్యాయని, రానున్న రోజుల్లో చిలికిచిలికి గాలివానగా మారే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారట. అదే జరిగితే కింజరాపు కుటుంబంలోనే చీలికలు ఏర్పడుతాయనే వాదన తెరపైకి వస్తోంది.
ఈ నేపథ్యంలో అధినేత నిర్ణయం ఎలా ఉంటుంది అరెస్టులతో న్యూస్ మేకర్‌గా నిలిచిన అచ్చెన్నాయుడుకి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారా, లేక యువతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో రామ్మోహన్ నాయుడుకే అవకాశం ఇస్తారా తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.