లాక్ డౌన్ సడలింపు అనంతరం ఏపీలో ప్రారంభం అయిన మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. నిన్న ఒక్కరోజే 67 కోట్ల రూపాయల మద్యం ఏపీలో అమ్ముడుపోయింది. చివరకి స్టాక్ అంత అయిపోవడంతో, అనేక చోట్ల నో స్టాక్ బోర్డ్ లు కూడా వెలిశాయి. రాష్ట్రంలో మొత్తం 3,500 షాపులు ఉండగా.. 2,151 షాపుల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరిగాయి. సాయంత్రం 7 గంటలకు మద్యం షాపులు మూసివేసేలోపే సాధారణ రోజులు కన్నా 20 శాతం పైబడి అమ్మకాలు జరిగాయి.
సుమారు 40 రోజుల నిర్బంధం తర్వాత తెరుచుకున్న మందుషాపుల వద్ద జనం పోటెత్తారు. మద్యం దుకాణాల వద్ద మందు బాబులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. కొన్ని చోట్ల ప్రభుత్వం చెప్పుకొచ్చిన సామాజిక దూరం లాంటివి మచ్చుకైనా కనపడలేదు.
మరోవైపు ఏపీలో మద్యం అమ్మకాలు రాజకీయ విమర్శలకు దారి తీశాయి. ఇంకా కొన్నాళ్ళు మద్యం దుకాణాలు తెరవకపోతే బాగుండేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదని, జగన్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతూ ప్రజల రక్తాన్ని, ప్రాణాల్ని గాలిలో కలుపుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అయితే ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. కేంద్రం ఇచ్చిన సడలింపులు కూడా తమకు అంటగట్టాలని చూస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.
మరోవైపు మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో 40 రోజుల పాటు కనపడని క్రైం వార్తలు మళ్లీ మొదలైయాయి. ముఖ్యంగా మద్యం మత్తులో భార్త అవమానించడంతో చిత్తూరులో ఓ తల్లి, బిడ్డ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా నివాసం ఉండే చొక్క లింగం మద్యానికి బానిస. అయితే భార్య మద్యం తాగొద్దని భర్తను వారించింది.. ఆ కోపంతో అతడు ఆమెపై దాడి చేశాడు. దీంతో మనస్థానికి గురైన జగదాంబ, కూతురు నందినితో కలిసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. నెల్లూరులో మద్యం మత్తులో ఓ హత్య జరగ్గా, రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు.