తిరుమలలో ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం
* టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశం
TTD: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి ఇవాళ సమావేశం కానుంది. అన్నమయ్య భవన్ లో పాలక మండలి సభ్యులు సమావేశం కానున్నారు. పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు, సలహాదారులు బడ్జెట్ ముసాయిదాపై చర్చిస్తారు. మూడువేల 500 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించబోతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ధార్మిక సేవల విస్తరణ, వివిధ ప్రాంతాల్లో దేవస్థానం తలపెట్టిన ఆలయ నిర్మాణపనులకు నిధుల కేటాయింపులపై చర్చిస్తారు. తిరుమలలో దేవస్థాన ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సుధీర్ఘంగా చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనున్నారు.
తిరుపతి సమీపంలోని అలిపిరి - చెర్లోపల్లి మార్గంలో తలపెట్టిన స్పిరిచ్యువల్ సిటీలో దాదాపు 50 వేల మంది భక్తులకు ఒకే చోట వసతి కల్పించేవిధంగా వసతిగృహ సముదాయం నిర్మించే విషయమై పాలకమండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులోని ఉలందూరు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి 4 కోట్లు, యానాంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి 3 కోట్లు నిధులను మంజూరు చేయనున్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదాల పంపిణీకోసం మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 8 కాటేజీల పునర్నిర్మాణం కోసం ఈ టెండర్ విధానంపై చర్చించనున్నారు.
2023-2024 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ గానూ 3500 కోట్ల రూపాయలతో బడ్జెట్ ముసాయిదాలను సిద్ధంచేసిన టీటీడీ అధికార యంత్రాంగ, భక్తులకు సేవలను మెరుగుపరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేయబోతున్నారు. దేశంలోనూ, పొరుగు దేశాల్లోనూ చేపట్టే శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులసాయంపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్లోనూ ప్రత్యేకంగా నిధులను కేటాయించబోతున్నారు.