Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం
Low Pressure: తెలంగాణలో నేడు పలుచోట్ల భారీ వర్షాలు
Low Pressure: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ అక్కడక్కడ భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల ఓ మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా దోమలపల్లిలో 4.9, నల్గొండలో 4.8, సిద్దిపేట జిల్లా కోహెడలో 4.3, ఖమ్మం జిల్లా రావినూతలలో 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఇవాళ తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని చెప్పారు అధికారులు.