AP Rains: బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం..డిసెంబర్ 15 వరకు ఏపీలో వర్షాలు
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తారీఖు వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి , ఏలూరు, ఎన్టీఆర్, కొన్ని చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల , ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని తెలిపారు. కోసినా పూర్తిగా ఆరని పనలను వర్షాల నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని తెలిపారు.
కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండేందుకు 5శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలన్నారు. రైతుల పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయే విధంగా చేయాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు, బాదులతో సపోర్టు అందించాలన్నారు. వ్యవసాయ సంబంధిత ఇతర సందేహాలు కూడా సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.