టోల్‌గేట్ సిబ్బందికి చుక్కలు చూపించిన ఓ లారీ డ్రైవర్.. అసలేం జరిగిందంటే..?
Toll Gate - Lorry Driver: లారీ ముందు పైకి ఎక్కిన సిబ్బంది అలాగే ఉంచి ఆపకుండా 10 కిలోమీటర్లు తీసుకెళ్లాడు...
Toll Gate - Lorry Driver: ఓ లారీ డ్రైవర్ టోల్‌గేట్ సిబ్బందికి చుక్కలు చూపించాడు. లారీని ఆపాలని అడ్డుకున్న సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టాడు. లారీ ముందు పైకి ఎక్కిన సిబ్బంది అలాగే ఉంచి ఆపకుండా 10 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే..? కర్నూలు జిల్లాలో ఓ లారీ డ్రైవర్ టోల్‌గేట్ సిబ్బందికి చుక్కలు చూపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆపేందుకు యత్నించిన టోల్‌గేట్ సిబ్బందిని సైతం లెక్క చేయకుండా ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. అమకతాడు టోల్ గేట్ వద్ద హరియాణా లారీని ఆపమని గుత్తి టోల్‌గేట్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. లారీని ఆపేందుకు అమకతాడు టోల్ ప్లాజా సిబ్బంది శ్రీనివాసులు యత్నించాడు.
శ్రీనివాసులు లారీ ముందు భాగంపై ఎక్కినా.. డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే 10 కిలోమీటర్లు పోనిచ్చాడు. అప్రమత్తమైన టోల్‌గేట్ సిబ్బంది నాలుగు బైక్‌లతో లారీని వెంబడించి... హైవే పోలీసులకు సమాచారం అందించారు. వెల్దుర్తి దగ్గర పోలీసులు లారీని ఆపి శ్రీనివాసులును కాపాడారు. నిన్న జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.