Land Price Hike: ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సారి 10 నుంచి 20 శాతం వరకు పెరగనున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు కరోనా ప్రభావంతో ప్రజా జీవితం చిన్నాబిన్నం అయితే మరోవైపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ల ఛార్జీలను పెంచడం తీవ్ర చర్చనీయంశంగా మారింది.
అమరావతి రాజధానిలోఒకవైపు రియల్ ఎస్టేట్ పతనం, మరోవైపు మూడు రాజధానుల నిర్ణయం, ఇంకోవైపు కరోనా వంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక పరిస్థితులు ఆగమ్యగోచరంగా మారాయి. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం రిజిస్ర్టేషన్ ఛార్జీల పెంపునకు నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ మేరకు రిజిస్ర్టేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల వారీగా పెరగనున్న భూముల విలువలను సంబంధిత జిల్లాలకు పంపారు.
ఏటా పట్టణ ప్రాంతంలో, రెండేళ్లకొకసారి గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను ప్రభుత్వం పెంచుతూ వస్తుంది. గతేడాది అర్బన్, రూరల్ ఏరియాల్లో ఛార్జీలను పెంచారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆయా ఛార్జీల పెంపు పట్టణ ప్రాంతాలకు పరిమితం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న భూముల విలువను 10 శాతానికి తగ్గకుండా పెంచారు. అంటే ఇప్పటివరకు అమలులో ఉన్న రిజిస్ర్టేషన్ ఛార్జీలన్ని పట్టణాల్లో ఎంతో కొంత పెరగబోతున్నాయి.
ఇదిలావుంటే ఆయా పట్టణాల్లోని వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రాంతాలతోపాటు శివారు ప్రాంతాలు, కొత్త లేఅవుట్లు వేసిన ప్రాంతాల్లో భూముల విలువను భారీగా పెంచనున్నారు. ముఖ్యంగా కమర్షియల్ ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరగబోతున్నాయి. దీంతో మొత్తం మీద ప్రభుత్వం రిజిస్ర్టేషన్ ఛార్జీల పెంపునకు తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆస్తుల క్రయ, విక్రయాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు మరింతగా స్తంభించిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.