Tirumala Laddu: శ్రీవేంకటేశ్వరుడు మిక్కిలి నైవేద్య ప్రియుడు
Tirumala Laddu: శ్రీవారి లడ్డు ఇంటికి తీసుకెళితే సాక్షాత్తు... స్వామివారు తమతో వచ్చినట్టు భావించే భక్తులు
Tirumala Laddu: తిరుమల... ఈ పేరు వినగానే ప్రతీ ఒక్కరి మదిలో మెదిలేది ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపం. ఆ స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు అత్యంత మహాప్రసాదంగా భావించి స్వీకరించేది శ్రీవారి లడ్డూ. అంతటి లడ్డూ ప్రసాదం తినడం మహా భాగ్యంగా భావిస్తారు భక్తజనం. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న శ్రీవారి లడ్డూలు ఎన్ని రకాలు ? అవేంటో మీరు చూడండి.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు... అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు. అంతకంటే మిక్కిలి నైవేద్య ప్రియుడు కూడా. అందుకే లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడతారు. ఇక భక్తులు కూడా ఆ లడ్డూను అత్యంత పవిత్రమైందిగానే భావిస్తారు. భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. స్వామి వారి లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తే సాక్షాత్తు ఆ శ్రీవారే తమతో వచ్చినట్టు ఉంటుందని భావిస్తారు.
స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డూకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. పద్మావతి అమ్మవారు తన బరువుకు సమానంగా తన స్వహస్తాలతో మొదటగా లడ్డూని తయారీ చేసి వరాహస్వామికి నైవేద్యంగా సమర్పించారట. అలా తన ప్రియసఖి పద్మావతి చేతులతో చేసిన లడ్డూనే ఈ కలియుగాంతం వరకు తన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారని శ్రీవారు అనుగ్రహించారట. ఇంతటి గొప్ప పురాణ ప్రాశస్త్యం కలిగిన లడ్డూను టీటీడీ ఎంతో నాణ్యతతో తయారు చేస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడుకి ఉచితంగా ఒక లడ్డూను అందిస్తోంది.
శ్రీవారికి నిత్యం వివిధ రకాల ప్రసాదాలను నివేదన చేస్తుంటారు ఆలయ అర్చకులు. శ్రీవారికి త్రికాల నైవేద్యం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు ఆలయ పండితులు. ప్రత్యేక పద్దతుల ద్వారా స్వామి వారికి ప్రసాదాలు తయారు చేసి నివేధిస్తుంటారు. అలా నివేధించే ప్రసాదాల్లో అన్నిటి కన్నా భక్తులు మహా ప్రసాదంగా భావించేది లడ్డు మాత్రమే. ఈ లడ్డు రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదని అంటారు భక్తులు. అందుకే ఈ లడ్డుకు జియోగ్రాఫికల్ పేటెంట్ లైసెన్సు లభించింది. అందుకే తిరుమల లడ్డు తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించరు కూడా.
ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తుంది టీటీడీ. లడ్డూ ప్రసాదాన్ని ఆస్థాన లడ్డు, కల్యాణోత్సవ లడ్డు, ప్రోక్తం లడ్డుగా విభజించారు. అందులో ఆస్థానం లడ్డూను శ్రీవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాలైనా ఆణివార ఆస్థానం, ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానం వంటి సందర్భాలలో తయారు చేస్తారు. స్వామివారికి నివేదించి అనంతరం ఆస్థానంలో పాల్గొన్న అర్చకులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు ఉంటుంది. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని రుచి మాత్రం అమోఘం.
కళ్యాణోత్సవ లడ్డును కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది ఈ లడ్డూ. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులకు ఈ లడ్డూని ఇస్తుంటారు. ఆలయం వెలుపల కౌంటర్‌లో ఒక్కోటి రూ. 200లకు విక్రయిస్తున్నారు. సాధారణ లడ్డులను ప్రస్తుతం భక్తులకు విరివిగా అందిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. వీటినే ప్రోక్తం లడ్డూలు అంటారు. దీని బరువు సుమారు 175 గ్రాములు ఉంటుంది.
కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆ స్వామివారి దర్శనం అనంతరం భక్తులు అధిక ప్రాధాన్యం ఇచ్చేది లడ్డూ ప్రసాదానికి మాత్రమే అని చెప్పాలి. క్షణకాలం ఆ స్వామిని దర్శించుకోవడానికి గంటల తరబడి ఎలా క్యూలో వేచి ఉంటారో... మహా ప్రసాదమైన లడ్డు పొందడానికి భక్తులు అంతే సహనంతో వేచి ఉంటారు.