Pawan Kalyan: ఉమ్మడి పశ్చిమ గోదావరిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
Pawan Kalyan: కౌలు రైతు బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించనున్న జనసేన
Pawan Kalyan: ఎల్లుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గతంలో షూటింగ్ నుంచి నేరుగా పార్టీ కార్యక్రమాలకు హాజరై అది పూర్తికాగానే తిరిగి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు వరుస కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు జనసేనాని. ఇందుకు నిదర్శనంగా 5 కోట్ల రూపాయలను పార్టీకి విరాళంగా ప్రకటించి నేతలు, కార్యకర్తలు, జనసైనికులను ఆశ్చర్యపరిచారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున సాయం ప్రకటించిన పవన్ ఇప్పటికే అనంతపురం జిల్లాలో 31 కుటుంబాలకు అందజేశారు.
ప్రతిపక్షంలో ఉంటూ ఇప్పటివరకు ఎలాంటి పవర్ అనుభవించకపోయినా సొంత డబ్బుతో ఇలాంటి కార్యక్రమం చేయడం పట్ల పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, జనసైనికులు ఫిదా అవుతున్నారు. రాజకీయంగా పార్టీ మరింత బలోపేతానికి తామందరి అభిప్రాయాలు స్వీకరించాలని పవన్‌కు వినతులు సమర్పిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో బలపడితేనే వైసీపీకి ప్రత్యామ్నాయం కాగలమని చెబుతున్న నేతలు తమతో భేటీ అయితే నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వివరిస్తామంటున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి వస్తున్న వినతులను పరిశీలించిన పవన్ అతి త్వరలోనే ప్రతి జిల్లాపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దీంతో ఖుషీ అవుతున్న నేతలు పవన్‌తో భేటీకి ఎదురు చూస్తున్నారు.