రేపు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీక్ష
*మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 12న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ నిరాహార దీక్ష
Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీక్షకు సిద్ధమవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 12న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష నిర్వహించనున్నారు పవన్.
విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరో దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విశాఖలో కార్మికుల దీక్షకు సంఘీభావం ప్రకటించి భారీ సభ నిర్వహించిన పవన్.. కేంద్రానికి లేఖలు రాశారు. అయితే కేంద్ర నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మరో దీక్ష నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు జనసేనాని.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకొనేందుకు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి అండగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదని జనసేన అంటోంది. కార్మికులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తమ ఆందోళనను నిరవధికంగా కొనసాగిస్తూనే ఉన్నారు. వారికి నైతిక మద్దతు ఇచ్చేందుకు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు నిరాహార దీక్షచేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్‌తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ దీక్షలో పాల్గొంటారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను పవన్ కళ్యాణ్ కోరారు.
ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ గతంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆంధ్రలు హక్కు - విశాఖ ఉక్కు అంటూ ఆయన గళం వినిపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకువెళ్లాలని పవన్ డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదు.
దాదాపు 300 రోజులకు పైగా విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాటం సాగిస్తున్న కార్మికులకు అండగా ఉండేందుకు జనసేన అధినేత దీక్ష చేపట్టనున్నారు. ఇప్పుడు ఈ దీక్షా వేదికగా మరోసారి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా. లేక నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం పైన మాట్లాడతారా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షగా పార్టీ నేతలు చెబుతున్నారు.