అనుకున్నదొక్కటి..అయినదొక్కటి

Update: 2020-02-20 04:23 GMT
అనుకున్నదొక్కటి..అయినదొక్కటి

వర్తక సంఘంపై ఆధిపత్యం చేయాలనుకున్న ధర్మాన ప్రసాదరావు వ్యూహం బెడిసికొట్టిందా? ఆధిపత్యం మాట దేవుడెరుగు అసలుకే మోసం వచ్చిందా..? రాష్ట్రస్థాయి నాయకుడిగా చెప్పుకునే ధర్మాన స్థాయిని, స్థానిక నాయకులు కిందికి లాగేశారా? శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘం చేపట్టిన కార్యక్రమంలో, ధర్మాన ప్రసాదరావుకి జరిగిన అవమానమేంటి?

ధర్మాన ప్రసాదరావు. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. ఆయన ఏ పార్టీలో ఉన్నా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయననే పెద్దదిక్కుగా చెప్పుకుంటారు. ఆయన ఎటువైపు వెళితే అటువైపు నడిచేందుకు ఒక పెద్ద సైన్యమే ఉంది. అలాంటి ధర్మాన ప్రసాదరావు, వైసిపి అధికారంలోకి వచ్చాక, మంత్రి పదవి ఆశించి భంగపడ్డాక, ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. అయితే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ధర్మాన, స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారనే వార్తలు, ఇప్పుడు సిక్కోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

కొద్దికాలంగా జిల్లా రాజకీయాల్లో స్తబ్దుగా ఉంటున్న ధర్మాన ప్రసాదరావు, ఇటీవల స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారా..? ప్రధానంగా తాను పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయాల్లో సైతం జోక్యం చేసుకోవడమేంటనే వార్తలు చర్చనీయాంశంగా మారాయట. ముఖ్యంగా స్థానిక నాయకులు, ఆయన అనుచర వర్గం మాటలు విని తప్పటడుగులు వేస్తున్నారని కొందరు నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట.

వాస్తవానికి శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో నాలుగు వర్గాలున్నాయి. అందులో మూడు వర్గాలు అధికార వైసీపీకి, మద్దతు తెలుపుతుండగా, మిగిలిన ఆ ఒక్క వర్గం మాత్రం టిడిపికి మద్దతు తెలుపుతోందట. అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి, మిగిలిన ఆ ఒక్క వర్గాన్నీ తమవైపు తిప్పికోవాలని అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగా వర్తక సంఘంలో తమ ఆధిపత్యం నడవాలంటే అన్ని వర్గాలు తమవే అయ్యి ఉండాలని చోటా నాయకులు ధర్మానకు నూరిపోశారట. దీంతో ధర్మాన సైతం తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారట. అభివృద్ధి జరగాలంటే వర్తక సంఘంలో ఎమ్మెల్యేకు అనుకూలమైన ప్రతినిధే ఉండాలనే భావనకు వచ్చారట. అందులో భాగంగా తన అనుచర వర్గంతో ఇదే విషయాన్ని బహిరంగ ప్రచారం సైతం చేయించారనే వార్తలు షికారు చేస్తున్నాయట.

అయితే ఈ అంశం టిడిపికి చెందిన వర్గంగా చెప్పుకునే వర్తకుల్లో అంతా మామూలుగానే కనిపించినా, అధికార పార్టీ మద్దతుగా ఉన్న వర్తకుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తిని రాజేసిందట. ముఖ్యంగా ఇటీవల శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలోని ధర్మాన వర్గం, ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇది బహిర్గతమైందట. ఈనెల 9వ తేదీన మార్కెట్ వర్తక సంఘంలోని ధర్మాన అనుకూల వర్గం నిర్వహించిన రక్తదాన శిభిరాన్ని, ఇటీవల ధర్మాన వ్యతిరేక వర్గంగా చెప్పుకునే మరో వర్తక సంఘం నిర్వహించిన కార్యక్రమాన్ని పరిశీలిస్తే వాస్తవాలు ఏమిటో తేలుతాయని కొందరు చర్చించుకుంటున్నారట.

ముఖ్యంగా ధర్మాన అనుకూల వర్గం నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది పాల్గొనగా, ఆయన వ్యతిరేక వ్యాపార వర్తక సంఘం కార్యక్రమంలో, సుమారు 200 మంది పాలుపంచుకోవడమే నిదర్శనమని అనుకుంటున్నారట. ఐతే ఇది అధికార పార్టీకి మద్దతుగా ఉన్న వర్తక సంఘానికే కాదు, ధర్మాన ప్రసాదరావుకే అవమానమన్న చర్చ శ్రీకాకుళం నగరంలో హాట్ టాపిక్‌గా మారిందట.

శత్రువుల్లో కూడా సానుభూతి పరులను దగ్గర చేసుకునే ధర్మాన, ఈసారి మాత్రం ఆ లాజిక్ మిస్సయ్యారట. సొంత పార్టీలో ఉన్నవారినే కాదు, వైరి పక్షాల్లో ఉన్న సానుభూతి పరులను కూడా దగ్గర చేర్చుకోవడమే ధర్మాన గెలుపు మంత్రమని చెప్పుకుంటారు. ప్రధానంగా 2004, 2009, 2019 ఎన్నికల్లో ఇటువంటి అంశాలే ధర్మాన గెలుపుకు సూత్రం అని కొందరు నేతలు చెప్పుకుంటున్నారట. అలాంటి ధర్మాన మార్కెట్ వర్తక సంఘం వ్యవహారంలో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారని కొందరు నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుని, పలుచన అవుతున్నారని సొంత పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట.

ఎంత బలవంతుడైన, అనువుగాని చోట అధికులమనరాదన్న మాటను, ధర్మాన మరచిపోయారని పార్టీ నేతలు అంటున్నారట. ఓవరాల్ గా వర్తక సంఘంలో అనుకున్నది ఒక్కటైతే, జరుగుతున్నది మరొకటిగా మారుతున్న మార్కెట్ వ్యవహారం నుంచి బయట పడేందుకు, ధర్మాన ప్రసాదరావు ఎలాంటి ఆలోచన చేస్తారో చూడాలి.


Full View


Tags:    

Similar News