Tokyo Olympics: హాకీ ప్లేయర్ రజనికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం.. 25 లక్షల నగదు..
Tokyo Olympics: ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీకి ఏపీ సీఎం జగన్...
Tokyo Olympics: ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీకి ఏపీ సీఎం జగన్ 25 లక్షల రూపాయల నగదు ప్రోత్సహం అందించారు. దాంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం గ్రామానికి చెందిన రజని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి కలిశారు. ఈ సందర్భంగా ప్లేయర్ రజనీని సీఎం జగన్ శాలువతో సత్కరించారు. జ్ఞాపికను బహుకరించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టు కాంస్యపతక పోరు వరకూ అద్భుతంగా ఆడారని సీఎం జగన్ కొనియాడారు. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దక్షిణాది నుంచి ఒలింపిక్స్ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా రజనీ గుర్తింపు పొందారని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుపతిలో వెయ్యి గజల నివాస స్థలం, నెలకు 40 వేల రూపాయల చొప్పున ఇన్సెంటివ్ లు కూడా ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రజనీ ఇప్పటి వరకు రెండు ఒలింపిక్స్ లో ఆడారు. 2016 రియో ఒలింపిక్స్ తో పాటు టోక్యో ఒలింపిక్స్ 2020లో ఆడారు. 110 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లలో పాల్గొన ప్రతిభ కనపరిచారు.