సైబర్ నేరగాళ్లకు కొమ్ము కాస్తున్న ఎస్సై : కర్నూలు జిల్లా గోనేగండ్లలో ఘరానా మోసం!
కంచే చేను మేస్తే... కాపాడేదెవరు? నేరాలను అరికట్టవలసిన పోలీసులే నేరగాళ్ల ముందు బోల్తా పడితే బాధితులకు దిక్కెవరు? అసలు సంగతి ఏంటో తెలుసుకోకుండా వేసిన ఒక తప్పటడుగు ఓ కుటుంబానికి వేల రూపాయల అప్పు మిగిల్చింది. లాక్‌డౌన్ సమయంలో ఇంటి యజమానిని దూరం చేసుకున్నామన్న బాధ ఒకవైపు పీడిస్తుంటే తాము ఇంత దారుణంగా మోసపోవడానికి కారణం పోలీసులేన్న ఆవేదన మరోవైపు వెంటాడుతుంటే... ఆ కుటుంబం ఇప్పుడు దీనంగా దిక్కులు చూస్తోంది. ఇంతకీ అసలు పోలీసులు చేసిన పొరపాటు ఏంటి? బాధితులను అంత బాధ పెట్టిన విషయం ఏంటి? కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన సమాజానికి ఇస్తున్న సందేశమేంటి?
కరోనా ఉధృతి కర్నూలు జిల్లాలో సైబర్ నేరగాళ్లకు అందివచ్చిన వరంలా మారింది. ఇక అసలు కథలోకి వెళ్దాం. గోనెగండ్లలో పంచాయితీలో 45 ఏళ్ల జంగం మల్లయ్య ట్రాక్టర్ డ్రైవర్. విధుల్లో ఉండగానే ఏప్రిల్ 19వ తేదీన గుండెపోటుతో మరణించారు. లాక్‌డౌన్ కఠినంగా అములవుతున్న సమయంలో ఈ విషయం వారి బంధువులకు కూడా తెలియదు. కానీ సైబర్ నేరగాళ్లు వెంటనే పసిగట్టారు. ఏప్రిల్ 26న గోనెగండ్ల ఎస్సై హనుమంతరెడ్డి మఠం శివయ్య అనే వ్యక్తి ద్వారా జంగం మల్లయ్య కుటుంబీకులను గోనెగండ్ల ఠాణాకు పిలిపించారు. స్టేషన్‌కు వచ్చిన మృతుని బంధువులతో విజయవాడ ఇంటెలిజెన్స్ DSP మాట్లాడుతాడని, తన ఫోన్‌లో స్పీకర్ ఆన్‌చేసి బాధితుల ముందు ఉంచాడు. డెత్ ఇన్సూరెన్స్ గురించి మల్లయ్య భార్య, అతని కూతురితో మాట్లాడించారు.
గోనెగండ్ల ఎస్సై హనుమంతరెడ్డి ఇచ్చిన విజయవాడ ఇంటెలిజెన్స్ DSP నెంబర్లకు బాధితులు ఫోన్ చేశారు. కానీ ఆ నెంబరు DSPది కాదు. సైబర్‌నేరగాళ్లది. జంగం మల్లయ్య డెత్ ఇన్సూరెస్ 7లక్షల 60 వేలు వస్తాయని సైబర్ నేరగాళ్లు బాధితులకు చెప్పారు. వెంటనే 36 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు ఇన్సూరెన్స్ మొత్తం 7 లక్షల 60 వేలు తమ అకౌంట్‌లో పడతాయని బాధితులను నమ్మించారు. ఫోన్‌నెంబరు సాక్షాత్తూ ఎస్సై ఇవ్వడంతో బాధితులు పాపం ఇంకేమీ ఆలోచించలేదు. అప్పు చేసి మరీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 36 వేలు వారిచ్చిన అకౌంట్‌కు బదిలీ చేశారు. మధ్యాహ్నం 2గంటల ఎప్పుడువుతుందా అని ఎదురు చూడసాగారు.
కానీ రెండు దాటింది... మూడు దాటింది... నాలుగు దాటింది... కానీ వస్తాయనుకున్న డబ్బులు రాలేదు. వెంటనే SI హనుమంతరెడ్డి ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేయసాగారు. ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. వీరి గుండెల్లో రాయిపడింది. విషయం చెప్పేందుకు సదరు SI దగ్గరకు వెళితే... కరోనా వస్తుంది... దూరంగా ఉండాలంటూ గద్దించారు. డబ్బులు వస్తాయని ఆశ చూపి... నమ్మించిన SI ఇప్పుడు కనీసం దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదంటూ వాపోతున్నాడు మృతుడి సోదరుడు వీరభద్రయ్య.
కానీ నమ్మకం అనేది ఒకటి ఉంటుంది కదా.!! SI హనుమంతరెడ్డి మీదున్న నమ్మకంతో, ఆశ చావని బాధితులు ఆయన ఇచ్చిన ఫోన్‌నెంబరుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆ ఫోన్ చేయడం ఎప్పుడో మానేసింది. ఆ విషయం బాధితులకు తెలియదు కదా!!. మోసపోయామని ఆలస్యంగా గ్రహించి బాధితులు SI హనుమంతరెడ్డిని నిలదీశారు. కానీ SI హనుమంతరెడ్డి చేసిందేమిటి సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. న్యాయం చేస్తానని మరోసారి నమ్మించారు. ఐదు రోజుల నుంచి డబ్బుల కోసం బాధితులు పోలీస్‌స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు.
కూలీచేసుకుని కడుపు నింపుకునే తమతో అప్పులు చేయించి తిప్పలు పెట్టిన SI హనుమంతరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా SPకి విన్నవించుకుంటున్నారు బాధితులు. అటు ఇటు తిరిగి ఈ విషయం హెచ్‌ఎంటీవీ దృష్టికి వచ్చింది. దీనిపై వివరణ కోరేందుకు SI హనుమంతరెడ్డిని సంప్రదించింది. వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించడమే కాకుండా కోడుమూరు CI పార్థసారధిరెడ్డి చెప్పితే తాను అలా చేయాల్సి వచ్చిందని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి సామాన్యులకు శాపంగా మారుతుంటే దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? ఏమైనా ఇంటలిజెన్స్ నుంచి నివేదిక తేప్పించుకుంటున్న జిల్లా పోలీసు బాసు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.