Anandayya Mandu: నేడు కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం

Anandayya Mandu: ఆనందయ్య ఆయుర్వేద మందులో శాస్త్రీయత నిర్ధారించి, మరింత విస్తృతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2021-05-24 03:48 GMT

Anandayya Mandu:(File Image) 

Anandayya Mandu: ఆనందయ్య మందుకు ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదు. ప్రస్తుతానికి నాటుమందుగా తేల్చి.. హానికరం కాదని చెప్పారు. అయితే కరోనాకు పని చేస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. దీనిపై వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. అలోపతి వర్సెస్ ఆయుర్వేదంగా నడిచిన వాదనలు.. ఇప్పుడు అలోపతి వర్సెస్ నాటుమందుగా మారాయి. అయితే దీనిపై త్వరగా తేల్చి.. ఉపయోగకరమైతే ప్రజలకు అందించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. నేడు ఐసీఎంఆర్ బృందం ఆనందయ్య మందును పరిశీలించనున్నది.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందును ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశీలించనుంది. ఇందుకోసం ఐసీఎంఆర్ బృందం సోమవారం కృష్ణపట్నానికి రానుంది. ఆనందయ్య ఆయుర్వేద మందులో శాస్త్రీయత నిర్ధారించి, మరింత విస్తృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆ మందును పరిశీలించిన నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఐసీఎంఆర్‌ను కోరారు.

ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఆయుష్‌ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించారు. ఈ మందు వల్ల ఎలాంటి నష్టం ఉండదని, అయితే దీన్ని ఆయుర్వేద మందు అనలేమని, పసరు మందుగానే గుర్తిస్తామని ఆయుష్ అధికారులు తెలిపారు. తాజాగా ఐసీఎంఆర్‌ బృందం కృష్ణపట్నంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐసీఎంఆర్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News