ఏలూరు ఘటనతో విశాఖ మహానగరంలో జివిఎంసి సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నగర ప్రజలకు సరఫరా అవుతున్న నీటి వనరులు సురక్షితంగా లేవని మాజీ ఐఎఎస్ అధికారి ముఖ్యమంత్రికి లేఖ రాయడం ప్రజలకు కలవరం పెడుతుంది. దీంతో వైజాగ్ తో పాటు జిల్లాలో నీటి సరఫరాపై తనిఖీలు నిర్వహించి, లోపాలను సరిచేసేందుకు అధికార యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.
దేశంలో 26 నగరాల్లో మున్సిపాల్టీల ద్వారా సరఫరా అవుతున్న నీటి వ్యవస్థల్లోని లోపాల కారణంగా ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ వికాస్ ఎకో టెక్ లిమిటెడ్ అనే సంస్థ నివేదికను బయటపెట్టింది. 33 శాతం నీటి నమూనాలును 26 నగరాల్లో సేకరించగా ఆ నీటిలో హై లెవెల్‌లో లీడ్ శాతం ఉందని క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ తేల్చింది.
విశాఖపట్నంలో నీటి వనరులు సురక్షితంగా లేవని పోర్టుల కాలుష్యం, జివిఎంసి గార్బేజీ వ్యర్థాలు జలాశయాల్లోకి వెళ్లడం, పారిశ్రామిక వ్యర్థ జలాలను సముద్రంలో వదలడం వల్ల ముప్పు పొంచి ఉందని మాజీ ఐఎఎస్ అధికారి శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో ప్రజలు నీటి కాలుష్యానికి గురైన నేపథ్యంలో విశాఖ నీటి సరఫరాపై పరిశోధనలు జరపాలంటూ సీఎంకు లేఖ రాసారు.
విశాఖలో సుమారు 25 లక్షల మందికి ప్రతిరోజూ 50 ఎంజిడి నీటిని జీవీఎంసీ సరఫరా చేస్తోంది. వివిధ రిజర్వాయర్లలో క్లోరిన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి కొళాయిలకు నీటి సరఫరా చేస్తుంది. నీటి సరఫరా పైప్‌లైన్‌లు డ్రైనేజీలు, యూజీడీ పైప్‌లైన్లు మధ్యలో నుంచి వుండడంతో నీరు కలుషితమయ్యేందుకు అవకాశం ఉంది. కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలు డయేరియా, మూర్చ, తల, కళ్లు తిరగడం వంటి రుగ్మతలకు గురికావాల్సి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందలాది మంది అంతుచిక్కని వ్యాధి లక్షణాలకు గురికావడానికి ఇలాంటి పరిస్థితే కారణమై వుంటుందని నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఏలూరు ఘటన నేపథ్యంలో విశాఖపట్నంలో అన్ని రకాల నీటి పథకాలను వారం రోజులు పాటు తనిఖీ చేస్తామని కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. జీవీఎంసీ, జిల్లా పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రత్యేక డ్రైవ్ పెట్టామని లోపాలు ఉంటే గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు ఘటనతో అధికారులు అప్రమ్తతమై వెంటనే చర్యలు తీసుకోవడంపై విశాఖవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.