Honor Killing: చిత్తూరు జిల్లాలో పరువు హత్య కలకలం
Honor Killing: చిత్తూరు జిల్లా పెంగరగుంటలో జరిగిన ఈ పరువు హత్య తీవ్ర కలకలం రేపింది.
Honour Killing: వయసులో ఉన్నవారు ప్రేమలో పడటం.. పెద్దలు వ్యతిరేకించడం .. ఇవన్నీ కామన్ అయిపోయాయి. కాని మనుషుల ప్రాణాలనే తీసేయడం అనేది కొన్ని కేసుల్లోనే జరుగుతుంది. తనకు ఇష్టం లేనివాడిని ప్రేమిస్తున్నందుకు కూతురుకు శిక్ష వేయకుండా.. కూతురు ప్రేమించినవాడికే మరణదండన విధించాడో తండ్రి. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ పరువు హత్య తీవ్ర కలకలం రేపింది.
తన ఇంట్లో తన కుమార్తెతో గదిలో కనిపించిన యువకుడిని ఓ వ్యక్తి హతమార్చి, ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలం పెంగరగుంటకు చెందిన బాబు (45) రైతు. అతడికి భార్య, కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ధనశేఖర్ అలియాస్ ధనుష్ (23)తో బాబు కుమార్తెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన బాబు.. ధనుష్‌ను హెచ్చరించాడు. దీంతో ధనుష్ బెంగళూరుకు వెళ్లిపోయి, అక్కడ డ్రైవర్ గా పనిచేసుకుంటున్నాడు.
ఈ నెల 21న ధనుష్ పెంగరగుంటకు వచ్చాడు. విషయం తెలిసిన బాబు కుమార్తె 22న ఫోన్ చేసి తండ్రి పొలానికి వెళ్లాడని ఇంటికి రావాలని కోరింది. దీంతో రాత్రి 11 గంటల సమయంలో ధనుష్ వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆమె గదిలో మాట్లాడుకుంటున్న సమయంలో పొలం నుంచి వచ్చిన బాబు గమనించాడు. అక్కడ ధనుష్‌ను చూసి తట్టుకోలేకపోయాడు. అదే గదిలో నిద్రిస్తున్న కుమారుడిని లేపి, కుమార్తెతో కలిపి వేరే గదికి పంపాడు. ఆ తర్వాత ధనుష్‌పై కట్టెతో దాడిచేశాడు. ధనుష్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి బైక్‌పై చిన్నకుంట గ్రామం వద్దకు తీసుకెళ్లి బావిలో పడేశాడు.
మూడు రోజుల తర్వాత ధనుష్ మృతదేహం పైకి తేలడంతో శవాన్ని పైకి తీసి పక్కనే ఉన్న మల్బరీ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ మృతదేహాన్ని ముక్కలుగా కోసి తన పొలం పక్కనే ఉన్న మరొకరి పొలంలో రెండు వేర్వేరు చోట్ల వాటిని పాతిపెట్టాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ ధనుష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ధనుష్ కాల్‌లిస్ట్ ఆధారంగా బాబును అరెస్ట్ చేశారు. శరీర భాగాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.