ఏపీలో ఊపందుకున్న పొలిటికల్ హీట్.. నాలుగు రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వాలన్న దానిపై...
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏపీ అధికార పార్టీలో ఆశావాహుల సందడి మొదలైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు శాసన మండలి రద్దు కావటంతో రాజ్యసభకు ఒత్తిడి పెరిగింది. ఏపీ నుంచి ఈ ఏప్రిల్‌లో మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. మరి పెద్దల సభ గడప ఎక్కే అవకాశం ఎవరికి రానుంది?
విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ - ఏపీలో ఊపందుకున్న పొలిటికల్ హీట్ - సంఖ్యాబలం కారణంగా నాలుగు వైసీపీ ఖాతాలోకే!!- నాలుగు స్థానాలు దక్కించుకునే నేతలు ఎవరు?
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 11 తెలంగాణకు ఏడు రాజ్యసభ సీట్లు కేటాయించారు. అందులో ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, కాంగ్రెస్ సభ్యుడు ఎంఏ ఖాన్ ఏప్రిల్ 9న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాంగ్రెస్ సభ్యుడైన టి. సుబ్బిరామరెడ్డి, టీడీపీ సభ్యురాలు తోట సీతారామాలక్ష్మి ఏప్రిల్ 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఏపీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా ఈ నాలుగు స్థానాలు మొత్తంగా వైసీపీకే దక్కనున్నాయి. దీంతో ఇప్పటికే జగన్ ఈ స్థానాలు ఎవరికి కేటాయించాలనే దాని పైన ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రాజ్యసభలో ఇద్దరు వైసీపీ సభ్యులు ఉన్నారు. విజయసాయిరెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇక, ఇప్పుడు ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో సామాజిక ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ జగన్ తమ సభ్యులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రముఖంగా జగన్ నలుగురి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తొలి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న అయోధ్య రామిరెడ్డికి, బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి తాజాగా వైసీపీలో చేరిన బీదా మస్తాన్‌రావుకు అవకాశం దక్కుతుందని ప్రచారం సాగుతోంది. ఎస్సీ కోటాలో 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు పేరు రేసులో ఉంది. అటు- న్యాయ వ్యవస్థలో కీలక స్థానంలో పని చేసిన ఒక ప్రముఖ వ్యక్తికి వైసీపీ నుంచి రాజ్యసభకు పంపాలని పార్టీ భావిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, పిల్లి సుభాష్, మోపిదేవి పేర్లు కూడా వినిపిస్తున్నాయ.
వైసీపీ నుంచి దక్కే నాలుగు సీట్లలో మూడు సీట్లు వైసీపీకి ఒక సీటు బీజేపీకి ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో ఉంది. ఎన్డీఏలో వైసీపీ చేరుతుందనే ప్రచారాన్ని సీనియర్ మంత్రులు బొత్సలాంటి వారు ఖండిస్తున్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నిక నుంచి, పౌరసత్వ సవరణ బిల్లు వరకు కేంద్ర ప్రభుత్వ ప్రతీ నిర్ణయానికి రెండు సభల్లోనూ వైసీపీ మద్దతిస్తూ వచ్చింది. దీంతో వైసీపీ భవిష్యత్‌లో ఇలాగే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ నడుస్తోంది.