Chandrababu Arrest: తెల్లవారుజామున చంద్రబాబుకు వైద్య పరీక్షలు
Chandrababu Arrest: తెల్లవారుజామున 4 గంటలకు చంద్రబాబుకు వైద్య పరీక్షలు
Chandrababu Arrest: ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చడంపై హైడ్రామా కొనసాగుతోంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. కుంచనపల్లి సిట్ ఆఫీస్‌కు తరలించారు. సిట్ ఆఫీస్‌లో దాదాపు 10 గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించారు సీఐడీ అధికారులు. అర్థరాత్రి 3 గంటల సమయంలో సిట్ ఆఫీస్ నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 50 నిమిషాల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపరుస్తారని అంతా భావించారు. కానీ.. అలా జరగలేదు. చంద్రబాబును మరోసారి సిట్ ఆఫీస్‌కు తరలించారు సీఐడీ అధికారులు. దీంతో హైడ్రామా నెలకొంది. ఇంకా రిమాండ్ రిపోర్ట్ రెడీ కాలేదనీ, దాన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడితేనే, జడ్జి విచారణ జరుపుతారని తెలుస్తోంది. అందువల్లే ఆయన్ని తిరిగి సిట్ కార్యాలయానికి తరలించారని తెలుస్తోంది.
సిట్ ఆఫీసులో దాదాపు 10 గంటలు పాటూ చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకూ ఈ విచారణ సాగింది. మధ్యలో కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబుని భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, బాలకృష్ణ, బ్రాహ్మణి కలిసి మాట్లాడారు. తెల్లవారుజాము 3 గంటల తర్వాత చంద్రబాబును విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి GGHకి తరలించారు. దాదాపు 10 మంది డాక్టర్ల టీమ్.. చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించింది. దాదాపు 50 నిమిషాలపాటూ వైద్య పరీక్షలు జరిగాయి. రొటీన్ టెస్టులు చేశామని డాక్టర్లు అన్నారు. వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టుకి కాకుండా.. సిట్ కార్యాలయానికి తరలించారు.
చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తరలిస్తారనే సమాచారంతో.. ఏసీబీ కోర్టు వద్ద లోకేష్‌తో పాటు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా ఎదురుచూస్తున్నారు. అయితే.. కాసేపట్లో సిట్ ఆఫీస్ నుంచి చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తరలిస్తారని తెలుస్తోంది.