Gulab Cyclone Update: ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తున్న గులాబ్ తుఫాన్
Gulab Cyclone Update: *కళింగపట్నంకు 290 కి.మీ దూరంలో కేంద్రీకృతం *ఉత్తరాంధ్రలో గంటకు 75 నుంచి 95 కి.మీ. వేగంతో గాలులు
Gulab Cyclone Update: ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారింది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాలపూర్‌కు 310 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నానికి 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తుపాన్ ఇవాళ సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది.
ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తలు శాఖ తెలిపింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కీలోమీటర్ల వేగంతో బలమైన ఈదురగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. తుపాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులు ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అత్యవసర సాయం అందించేందుకు బృందాలను కూడా సిద్దం చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్‌ను పంపారు.