అభినందనలు అందుకుంటున్న గూడూరు ఆర్‌డీఓ

* జలదిగ్భంధంలో చిక్కుకున్న గ్రామానికి మరబోట్లలో వెళ్లిన ఆర్‌డీఓ

Update: 2022-12-12 07:44 GMT

అభినందనలు అందుకుంటున్న గూడూరు ఆర్‌డీఓ

Gudur: ఇప్పటివరకు ఎంతోమంది అధికారులు వరద సమయాల్లో విధులు నిర్వహించారు. కింద స్థాయి అధికారులుతో పనులు చేయించారు. కానీ, స్వయంగా వారే పనిలోకి దిగలేదు. అయితే నూతనంగా గూడూరు ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్ అత్యవసర సమయాల్లో స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇలాంటి ఓ ఘటన ప్రజల అభిమానాలను మూటగట్టుకుంది. శభాష్ ఆర్‌డీఓ అని ప్రశంసలు కురిపించేలా చేస్తోంది.

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం గ్రామం భారీ వర్షాలు కురిసినప్పుడు, వరద వచ్చిన ప్రతి సారీ జలదిగ్బంధంలో చిక్కుకుపోతుంది. గ్రామానికి చేరుకోవాలంటే ఉప్పుటేరు దాటాల్సిందే వరదల సమయంలో ఉప్పుటేరు పొంగి ప్రవహించడంతో ఆ గ్రామానికి రాకపోకలు తెగిపోతాయి. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం ఆ గ్రామస్తుల కలగానే మిగిలింది. ఈ క్రమంలో వారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున ఉప్పుటేరు పొంగి.. ఈ గ్రామం జలధిగ్బంధంలో చిక్కుకుపోయింది.

కాగా గ్రామంలో డయాలసిస్ రోగితోపాటు గర్భిణికి వైద్యసేవలు అత్యవసరమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన గూడూరు ఆర్డీఓ కిరణ్‌కుమార్ మర బోట్లలో ఈ గ్రామానికి వెళ్లారు. డయాలసిస్ రోగితోపాటు గర్భిణిని ఇవతల వైపు ఒడ్డుకు తరలించారు. సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో వారిని ఎక్కించి వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయనే 108 వాహనంలో కూర్చుని అధికారులకు సూచనలు చేస్తూ గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న తీరుతో అభినందనలు అందుకుంటున్నారు. ఆస్పత్రిలో వైద్యసేవలు అందించేలా అధికారులకు సూచనలు చేశారు. 

Tags:    

Similar News