Ganja: స్మార్ట్ సిటీ కేంద్రంగా గంజాయి చీకటి సామ్రాజ్యం
Ganja: కోవిడ్ సెకండ్‌వేవ్ తర్వాత రెచ్చిపోతున్న మత్తు ముఠాలు
Ganja: స్మార్ట్ సిటీ వైజాగ్ కేంద్రంగా గంజాయి చీకటి సామ్రాజ్యం అంతకంతకూ విస్తరిస్తోంది. మన్యంలో అమాయక గిరిజనులే టార్గెట్‌గా మత్తు మాఫియా రెచ్చిపోతోంది. వేలకు వేల ఎకరాల్లో మత్తు సాగును గుట్టుగా సాగించడమే కాదు దేశ విదేశాలకు అంతే సులువుగా ఎక్స్‌పోర్ట్ చేసేస్తోంది.
కోవిడ్ సెకండ్‌వేవ్ తర్వాత మత్తు ముఠాలు రెచ్చిపోతున్నాయి. నిఘా కళ్లుకప్పి టన్నుల కొద్దీ గంజాయిని దేశంలోని అన్ని ప్రాంతాలకు తరలించేస్తున్నాయి. రీసెంట్‌గా బోర్డర్‌లు దాటిన గంజాయి విలువ వందల కోట్లు ఉంటుందంటేనే మత్తు మాఫియా ఏ రేంజ్‌లో చెలరేగిపోతోందో అర్ధం చేసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, కలప, స్ర్కాప్, లిక్విడ్ ఇలా అధికారుల తనిఖీల్లో ఏ మాత్రం దొరక్కుండా ఉండేందుకు అన్ని మార్గాలను ముఠా వాడుకుంటోంది.
విశాఖ ఏజెన్సీలోని 30 పంచాయితీల పరిథిలో 150కు పైగా గ్రామాల్లో గంజాయి గుట్టుగా సగయిపోతోంది. మావోయిస్టుల ప్రాభల్యం ఎక్కువగా ఉండడంతో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అంత తేలిగ్గా వెళ్లలేని పరిస్థితులు. దీంతో మత్తు మాఫియా ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. నిజానికి 2017లోనే డ్రోన్స్‌తో గంజాయి పంటలను గుర్తించి నాశనం చేయాలన్న అధికారుల ప్రణాళికలు ఏమాత్రం కార్యరూపం దాల్చలేదు.
ఐదేళ్ల క్రితం వరకూ వందా, రెండొందల కిలోల గంజాయి పట్టుబడితే రీసెంట్ టైమ్‌లో మాత్రం వేల కిలోల గంజాయి అక్రమ రవాణా కేసుల్లో దొరుకుతోంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే ఎక్కువగా గంజాయి రవాణా జరిగేది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం గంజాయి రవాణా జరగుతున్న రాష్ట్రాల జాబితా అమాంతం పెరిగిపోయింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా యదేశ్చగా సాగుతోంది.
ఇదే సమయంలో గంజాయి అక్రమ రవాణాపై విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మత్తు మాఫియాను అరికట్టడంలో ఫలితం మాత్రం సూన్యం అని వాపోతున్నారు. అధికారులు గంజాయి రవాణాపైనే ఫోకస్ చేస్తున్నారని, సాగుపై ఎందుకు దృష్టి సారించడంలేదని ప్రశ్నిస్తున్నారు. గంజాయి సాగును అరికడితేనే రవాణా అడ్డుకోవచ్చంటున్నారు.