Sri Sathya Sai District: స్వగ్రామానికి బైక్ పై కొడుకు డెడ్ బాడీ..
Sri Sathya Sai District: జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు
Sri Sathya Sai District: ఇంటిదగ్గరకే వైద్య సేవలంటారు. మేం అధికారంలోకి వచ్చాక మొత్తం వ్యవస్థే మార్చేశామంటారు. మీ సేవలో మేమున్నాం అంటారు. ఇలా పాలకులు మైకులు పట్టుకొని చెప్పడమే తప్ప.. నిజంగా ఆ వైద్యం, ఆ సేవ ప్రజలకు అందుతున్నాయా అంటే ఆ సమాధానం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రాణం బాగలేక దవాఖానాలకు వచ్చే పేదలకు సాయం అందించడం పక్కనపెడితే.. అసలే కష్టాల్లో ఉన్న వారిని ఇబ్బందులకు గురిచేస్తుండటం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ అమానవీయ ఘటనే ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వెలుగులోకి వచ్చింది.
శ్రీసత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో.. బాలుడు మృతదేహన్ని తల్లిదండ్రులే బైక్ పై ఇంటికి తీసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జ్వరంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు మృతిచెందాడు. దీంతో బాలుడి శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని.. అతని కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందిని కోరారు. ఎంతసేపు ఎదురుచూసిన అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బాలుడి తల్లిదండ్రులే శవాన్ని బైక్ పై ఇంటి వరకు తీసుకెళ్లారు.
అమరాపురం మండలం హనుమంతుల గ్రామానికి చెందిన ఓ బాలుడికి జ్వరం రావడంతో.. పేరేంట్స్ తమ కొడుకుని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు డెంగ్యూగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సమకూర్చాలని పేరేంట్స్ ఆసుపత్రి సిబ్బందిని కోరారు. అయితే వాహనం లేదని చెప్పడంతో.. తమ దగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో కొడుకు డెడ్ బాడీని బైక్ పైనే తీసుకెళ్లారు.
తమ బిడ్డ ఇక తిరిగిరాడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పుట్టెడు దుఖంలోనూ వారే.. తమ బిడ్డ శవాన్ని బైక్ పై తీసుకెళ్లారు. నిన్నటి దాక తమ కళ్లముందు ఆడుకున్న కొడుకు ఇక తిరిగిరాడని తెలిసినా.. గుండెను బండ చేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. విగత జీవిగా ఉన్న బాలుడిని పొత్తిళ్లల్లో హత్తుకుని బైక్ పై కూర్చుంది ఆ తల్లి. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని కలిచివేసింది.