ఏపీ ఎగ్జిట్ పోల్స్ గందరగోళం.. చంద్రబాబు, జగన్... ఇరు వర్గాల్లో టెన్షన్

ఏపీలో కూటమి వైపు ఇండియా టుడే.... వైసీపీదే గెలుపంటున్న టైమ్స్ నౌ. దిగ్గజ మీడియా సంస్థల విశ్వసనీయతకు సవాల్. ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకీ గందర గోళం?

Update: 2024-06-03 07:30 GMT

చంద్రబాబు, జగన్... ఎగ్జిట్ పోల్స్ తో ఇరు వర్గాల్లో టెన్షన్...

టైమ్స్ నౌ .. ఇండియా టుడే.. జాతీయస్థాయిలో ఈ రెండు దిగ్గజ మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. పూర్తిగా భిన్నమైన ఫలితాలు ప్రకటించిన ఈ రెండు సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో ఏది నిజమమవుతుందో, ఏది గాలిబుడగలా పగిలిపోతుందో తెలియటానికి ఇంకా 24 గంటల సమయం కూడా లేదు. కాకపోతే ఆ రెండు సంస్థల విశ్వసనీయతకు ఏపీ ఎన్నికల ఫలితాలు సాక్షీభూతంగా నిలవనున్నాయి. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ - ఈటీజీలు జాతీయ స్థాయిలో కాస్త అటూ ఇటుగా ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పగా ఏపీ విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన ఫలితాలను ప్రకటించటం ఆశ్చర్య పరుస్తోంది.

ఈ రెండు ప్రముఖ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో ఒకటే కరెక్ట్ అవుతుంది. రెండోది ఫెయిల్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్క్ ఉన్న ఈ రెండు మీడియా సంస్థల విశ్వసనీయతకు వాటి ఎగ్జిట్ పోల్స్ పలితాలు సవాల్ గా మారనున్నాయి. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఏపీలో ఎన్డీఏకు ఎదురులేదనీ, అధికారపార్టీ వైసీపీ అతి తక్కువ సీట్ల తో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఎన్డీఏ కూటమి 53 శాతం ఓట్ షేరింగ్ తో 21 నుంచి 23 సీట్లు వస్తాయని చెప్పింది. వైసీపీ కేవలం 41 శాతం ఓట్లు సాధించి 2 నుంచి 4 లోక్ సభ సీట్లకు పరిమితమవుతుందని తేల్చి చెప్పింది. దీని దామాషా ప్రకారం 150కు పైగా అసెంబ్లీ సీట్లు కూటమికే రావాలి.. ఈ పైన 20 నుంచి 25 అసెంబ్లీ సీట్లకు వైసీపీ పరిమితం కావాలి.

నిజానికి ఏపీలో ఎన్డీఏకు అంతటి పెనుగాలి ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓ భారీ ప్రభంజనం వీస్తే తప్ప ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ నిజమయ్యే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్డీఏకు దేశవ్యాప్తంగా 361 నుంచి 401 సీట్లు వస్తాయని ఇండియా టుడే చెప్పింది. ఈ ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన ‘చార్ సౌ‘ లక్ష్యానికి దగ్గరగా ఉంది. చార్ సౌ కు అదనంగా మరో సీటును కలిపి గరిష్టంగా 401 సీట్లను ప్రకటించటం ద్వారా మోడీకి మించి ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్ రూపంలో రాజకీయ ప్రకటన చేసిందని విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు.

మరో వైపు జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ - ఈటీజీ భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించింది. జాతీయస్థాయిలో ఎన్డీఏకు 358 లోక్ సభ సీట్లు ప్రకటించిన టైమ్స్ నౌ అందులో ఏపీ వాటాను 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఏపీలో వైసీపీ 14 లోక్ సభ సీట్లను గెల్చుకుంటుందని తేల్చి చెప్పింది. 51 శాతం ఓట్ షేరింగ్ తో ఏపీలో వైసీపీకి 117 నుంచి 125 అసెంబ్లీ సీట్లు దక్కుతాయని కూడా వెల్లడించింది. 47 శాతం ఓట్ షేరింగ్ తో ఎన్డీఏ కూటమికి ఏపీలో 50 నుంచి 58 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

నిజానికి టైమ్స్ నౌ కేవలం రెండు నెలల క్రితం ఏప్రిల్ 4న ప్రకటించిన సర్వే ఫలితాలకూ, ఇప్పటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు చాలా తేడా ఉంది. ఏపీలో అదికార వైసీపీ 22 అసెంబ్లీ సీట్లను గెల్చుకుంటుందని టీవీలో ప్రసారం చేసింది. తెలుగుదేశం-జనసేన కలిపి 2 నుంచి 3 సీట్లు మాత్రం దక్కించుకుంటాయని కూడా చెప్పింది. ఆ తరువాత తెలుగుదేశం-జనసేన ఎన్డీఏలో భాగమయ్యాయి. ఇపుడు టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇపుడు వైసీపీకి 8 సీట్లు తగ్గించి 14 సీట్లకు టైమ్స్ నౌ పరిమితం చేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు తాము ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించినే 358 సీట్లు రావాలంటే ఏపీ నుంచి కూడా రీజనబుల్ షేరింగ్ ఉండాలి కదా.. అందువల్లనే టైమ్స్ నౌ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి లోక్ సభ సీట్లు రెండు నెలల్లోనే 8 తగ్గిపోయాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారం చేపడుతుందని టైమ్స్ నౌ.. అదేం కాదు.. ఎన్డీఏ కూటమే భారీ మెజారిటీతో గెలుస్తుందని ఇండియా టుడే రెండు భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఎవరు చెప్పేది నిజమో, మరెవరు చెప్పేది అత్యుత్సాహమో తెలియాలంటే ఈ రోజు జూన్ 3.. రేపు జూన్ 4 మధ్యాహ్నం దాకా కాస్త ఉగ్గబట్టి వెయిట్ చేయాలి.

Tags:    

Similar News