AP Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం
AP Pension Distribution: ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ
AP Pension Distribution: ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ రేపు ప్రారంభంకానుంది. తొలిరోజే 100 శాతం పంపిణఈ పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫించన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే, కఠినచర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లను అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఏపీలో జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పింఛను లబ్ధిదారులు, ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65 లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు 4వేల 408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్నారు.
సామాజిక భద్రతా పింఛన్లను.. లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి ప్రభుత్వం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను ఇప్పటికే సచివాలయ సిబ్బందికి స్పష్టంచేసింది. ఒక్కరోజులోనే పంపిణీ చేయించాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండోరోజు పూర్తి చేయాలని నిర్దేశించింది. వృద్ధులు, వితంతువులతో పాటు మొత్తం 11 రకాల ఫించన్ దారులకు.. పింఛను 3వేల నుంచి 4వేలకు పెంచడంతో.. జూలైన్ పింఛన్ 4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఎరియర్స్ కలుపుకుని మొత్తం 7వేలు పంపిణీ చేయనున్నారు.