విజయనగరం జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులు
* విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం * ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి * పరశురాంపురంలో రైతుపై ఏనుగులు దాడి * ఏనుగుల దాడితో మూడేళ్లలో ఆరుగురు మృతి * భయాందోళనలో స్థానికులు
విజయనగరం జిల్లా వాసులను ఏనుగులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వరుస దాడులతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడంతో పాటు.. పొలంలోని మోటార్లను ధ్వసం చేస్తున్నాయి. ఆస్తి, ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏనుగుల దాడితో మూడేళ్ల కాలంలో ఆరుగురు మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
విజయనగరం జిల్లాలో ప్రదానంగా కొమరాడ మండలంలో గత కొన్నిరోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. రాత్రివేళ భీంకర అరుపులతో గ్రామాల్లో తిరుగుతూ పంట పొలాలు, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల గుంపు దాడిలో ఇప్పటివరకు వందలాది ఎకరాలు దెబ్బతిన్నాయి. ఏనుగులను తరిమికొట్టేందుకు గ్రామస్తులు టపాసులు పేల్చడం, డప్పులు వాయించడం లాంటి చర్యలు చేపడుతున్నప్పటికీ.. అవి మళ్లీ మళ్లీ తిరిగొస్తున్నాయి. దీంతో రైతులు కూడా విసుగెత్తిపోయారు.
తాజాగా.. విజయనగరం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పరశురాంపురంలో ఏనుగుల గుంపు పొలాలను ధ్వంసం చేసింది. అటుగా.. పొలం పనికి వెళ్తున్న ఓ రైతుపై దాడి చేశాయి ఏనుగులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రైతు లక్ష్మీనాయుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల దాడిలో రైతు మృతితో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మూడేళ్లలో ఏనుగుల దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారని.. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.