చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం బెండనకుప్పం, ఎంకేపురం, ముళ్లూరు, మఠం పరిసర గ్రామాల ప్రజలను ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత మూడు రోజులుగా గ్రామాలకు చేరువలో ఉన్న 13 ఏనుగుల గుంపు ఏ క్షణాన గ్రామాలపై పడుతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో రాత్రంతా జాగరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రిళ్ళు గ్రామాలలో ఫైర్ క్యాంపులు పెట్టి, టపాకాయలు కాలుస్తూ ఏనుగులు తమ గ్రామాలవైపు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
గ్రామం విడిచి వెళ్ళాలంటే గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. రాత్రిపూట వంతుల వారీగా గ్రామాలకు కాపలా కాస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించి ప్రశాంతంగా జీవించే అవకాశాన్ని కల్పించండని వేడుకుంటున్నారు.. గత నాలుగు రోజులగా శాంతిపురం మండలంలో తిష్ఠివేసిన గజరాజులు ప్రస్తుతం బెండకుప్పం గ్రామ సమీపాన సంచరిస్తున్నాయి.