విశాఖ జిల్లా నర్సీపట్నంలో దారుణం జరిగింది. ఓ మహిళకు నడిరోడ్డుపై అవమానం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు నడిరోడ్డుపై ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆమె చీర లాగేసి నలుగురిలో ఆమెను అవమానపరిచారు. అంతేకాదు, కులం పేరుతో ఆమెను తీవ్ర దుర్భాషలాడారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కోటవురట్ల మండలం యండపల్లికి చెందిన మూర్తి నానిబాబు(ఆటోడ్రైవర్),భార్య రాజేశ్వరి, సోదరుడు అప్పలరాజు కలసి బుధవారం నర్సీపట్నంఏరియా ఆస్పత్రికి బయలుదేరారు. పూటు గా మద్యం తాగిన బొడగ రామకృష్ణ , ఎలిశెట్టి నాగేశ్వరరావులు బైక్‌పై వస్తూ అబీద్‌సెంటర్ వద్ద ఆటోను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య వల్ల ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు కొంతదూరం వచ్చిన తరువాత ఆటోను ఆపి డ్రైవర్ నానిబాబును ఆటోలోంచి కిందకు దించి తీవ్రంగా కొట్టారు. అడ్డుకోబోయిన అతని భార్య రాజేశ్వరి చీర లాగేశారు. కులం పేరుతో దుర్భాషలాడారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.