ఏపీలో డాక్టర్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు.. ఇవాళ 500 ఏసీ వాహనాలు...
AP News: *ఏడాదికి సగటున 4 లక్షల మందికి సౌకర్యం *అందుబాటులోకి వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ యాప్
AP News: డాక్టర్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలలో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్ కండిషన్డ్ వాహనాలను ఇవాళ విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. నెలలు నిండి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే అక్కచెల్లెమ్మలను, వారి ఇంటి నుండి 108 వాహనంలో తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చి నాణ్యమైన వైద్యసేవలు, డబ్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందిస్తారు.
ప్రసవానంతరం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లికి విశ్రాంతి సమయంలో అవసరాల కోసం రూ. 5000 చేతిలో పెట్టి మరీ ఆ తల్లీబిడ్డలను అంతే క్షేమంగా ఇంటికి చేర్చుతారు. డాక్టర్ వైఎస్సార్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టడంతో పాటు సేవలను విస్తరించిన కారణంగా ఏడాదికి సగటున 4 లక్షల మందికి ఈ మంచి సౌకర్యం అందుబాటులోకి రానుంది. తల్లులకు సహాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత కాల్ సెంటర్ , ప్రసవానంతర తల్లుల సౌకర్యార్ధం నర్సులు, డ్రైవర్ల సమన్వయం కోసం వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
అరుదుగా దొరికే ఆ సాధారణ వాహనంలో కూడా ఒకే ట్రిప్‌లో ఇద్దరు ప్రసవానంతర మహిళలు, నవజాత శిశువులు, వారి సహాయకులు, వారి లగేజ్‌తో కలిసి ప్రయాసలకు ఓర్చి ప్రయాణించాల్సిన దుర్భర పరిస్ధితి ఉండేది. నేడు అత్యాధునిక వసతులతో కూడిన పూర్తి ఎయిర్ కండిషన్డ్ వాహనంలో ప్రత్యేకంగా అన్ని వసతులతో వారిని బాగా చూసుకుంటూ ఒక తల్లి, బిడ్డ, వారి సహాయకులు ఇద్దరు మాత్రమే సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది.
తల్లుల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలు జీపీఎస్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కలిగి ఉంటాయి. అక్కచెల్లెమ్మలు వాహనం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏ వాహనం ఎక్కడ ఉందో రియల్ టైంలో తెలుసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 102 ఉపయోగించుకోవాలి.