AP: ప్రియుడి దాడి.. బ్రెయిన్ డెడ్ అయిన యువతి జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి
AP: రౌడీషీటర్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువతి మంగళవారం మరణించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. యువతిపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
AP: రౌడీషీటర్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువతి మంగళవారం మరణించింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడించింది. దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన పూర్తి కథనం ప్రకారం..తెనాలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లభాపురానికి చెందిన రౌడీ షీటర్ నవీన్, తెనాలి ఐతానగర్ కు చెందిన సహాన ఆరేళ్లుగా వీరిద్దరూ స్నేహితులు.
మూడు నెలల క్రితం నవీన్ కు ఆమె రూ. 3లక్షలు ఇచ్చింది. రూ. 1.50 లక్షలు తిరిగి చెల్లించాడు. మిగతా మొత్తం ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 19న ఇద్దరూ కారులో తెనాలి మండలం కఠెవరం శివారు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సహాన తనకు రావాల్సిన నగదుతోపాటు తాను నవీన్ వల్ల గర్భం దాల్చిన విషయాన్ని చెప్పింది.
దీంతో మాటా మాటా పెరిగిన క్రమంలో యువతి తలను పట్టుకుని కారు డోర్ కేసి బాదాడు. ఆమె వాంతి చేసుకుని పడిపోయింది. దీంతో గాభరా పడిన నవీన్ ఆమె తల్లికి సమాచారం ఇచ్చి తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాడు. నవీన్ కు అతని స్నేహితులు సహాయం చేశారు.
సహాన బ్రెయిడ్ డెడ్ అయినట్లు స్థానిక వైద్యులు చెప్పారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల చికిత్స అనంతరం మంగళవారం రాత్రి సుహాన ప్రాణాలు విడిచింది.
అయితే కారులో నవీన్, సహాన మాత్రమే ఉన్నట్లు తమ విచారణలో తేలిందని..నవీన్ ఓ రాజకీయ పార్టీ పదవుల్లోనూ లేడని..ఇది ప్రేమికుల మధ్య జరిగిన ఘటన అని మీడియా అడిగిన ప్రశ్నలకు డీఎస్పీ సమాధానం చెప్పారు. అయితే 2016లో జరిగిన హత్య కేసుల్లో నిందితుల్లో ఒక్కడైన నేపథ్యంలో నవీన్ పై రౌడీ షీట్ తెరిచినట్లు డీఎస్పీ వివరించారు.