Polavaram Project: ఇవాళ పోలవరం ప్రాజెక్టుపై డీడీఆర్పీ సమావేశం
Polavaram Project: డయాఫ్రమ్ వాల్‌పై నివేదికలు సమర్పించనున్న నిపుణులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై డీడీఆర్పీ సమావేశం ఇవాళ జరగనుంది. ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం ప్రతినిధులు, జల విద్యుత్ సంస్థ, మట్టి పరిశోధనా కేంద్రం, S.E.R.C, ఐఐటీ ఢిల్లీ, తిరుపతి నిపుణులు ఈ సమవేశంలో పాల్గొననున్నారు. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ఎంతో కీలకమైన డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలే అవకాశం ఉంది. ఇందుకోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో డీడీఆర్పీ బృందంతో పాటు P.P.A, C.S.I.R, C.M.D.D, N.H.P, C.W.C తదితర బృందాలు పర్యటించాయి. ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ ప్రతినిధులు ఇప్పటికే వీలైనంత మేర డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలు పూర్తి చేశారు. వారు నివేదికతో సమావేశానికి హాజరై ప్రజెంటేషన్ ఇస్తారని తెలిసింది. నివేదిక ఆధారంగా డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనంత మేర నిర్మించడమా...? లేక మళ్లీ కొత్తది పూర్తిగా నిర్మించడమా అన్న అంశాలపై చర్చించనున్నారు. నిపుణులు శనివారం పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 2 డి వాల్, ట్రైల్స్, జీ హిల్, పైడిపాక డంప్ హిల్, గైడ్ బండ్ అప్రోచ్ ఛానల్, స్పిల్ వే సందర్శించారు.