Cyclone Dana: దూసుకొస్తున్న దానా తుఫాన్..ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాన్ క్రమంగా బలపడుతూ..తీరంవైపు దూసుకువస్తోంది. తూర్పు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాన్ 12కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది.
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాన్ క్రమంగా బలపడుతూ..తీరంవైపు దూసుకువస్తోంది. తూర్పు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాన్ 12కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాన్ ఉత్తరాంధ్రపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఐఎండి సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దానా తుపాన్ గడిచిన 6గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపారు.
బుధవారం సాయంత్రానికి ఒడిశాలోని పారాదీప్ కి 460 కి.మీ ఒడిశాలోని ధమ్రాకు 490 కి.మీ పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి 540 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించారు. తుపాన్ వాయువ్య దిశగా కదులుతూ గురువారం అక్టోబర్ 24 తెల్లవారుజామునకు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ గా రూపాంతరం చెందుతుందని వివరించారు.
తుపాన్ ప్రభావంతో గురువారం కోస్తా జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు పూరీ సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా సమీపంలో తీవ్ర తుపాన్ దానా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా ఉంటుందని..మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తీవ్ర తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండటంతోపాటు చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి గురవారం రాత్రి వరకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.