Cyclone Yaas Effect: తూర్పు తీరానికి ముంచుకొస్తున్న ముప్పు
Cyclone Yaas Effect: యాస్ తుపాను ప్రభావంతో వచ్చే 4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Yaas Effect: పశ్చిమ తీరాన్ని వణికించిన తౌక్తే అత్యంత తీవ్ర తుపాను బలహీనపడిన కొద్దిరోజులకే యాస్ తుపాన్ దూసుకొస్తోంది. ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి బలపడి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఇది సోమవారం నాటికి తుపానుగా మారి.. మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా మారనుందని ఆమె వివరించారు. మే 26న సాయంత్రానికి బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనుందని పేర్కొన్నారు. యాస్ తుపాను ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మే 23 నుంచి 26వరకు మత్స్యకారులు చేపల వేటకువెళ్లొద్దని స్టెల్లా హెచ్చరించారు. తుపాను దృష్ట్యా విశాఖ కలెక్టరేట్‌లో ఈ-కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు సాయం చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. కంట్రోల్ రూమ్ నంబర్లు.. 0891-2590102, 0891-2590100
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడలో పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే 59 రైళ్లను రద్దు చేసింది. ఇందులో హౌరా-హైదరాబాద్ (08645), హైదరాబాద్-హౌరా (08646), హౌరా-సికింద్రాబాద్ (02703) రైళ్లు ఈ నెల 25 నుంచి 27 వరకు నిలిచిపోనుండగా, సికింద్రాబాద్-హౌరా (02704) రైలు రేపటి నుంచి 26వ తేదీ వరకు రద్దు అయింది. అలాగే, భువనేశ్వర్-సికింద్రాబాద్ (07015) ఈ నెల 26 నుంచి 28 వరకు రద్దు కాగా, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే రైలు (07016) 24 నుంచి 26 వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
తిరుపతి-పూరి రైలు రేపటి నుంచి 26 వరకు నిలిచిపోనుండగా, పూరి-తిరపతి మధ్య రైలు 26 నుంచి 28 వరకు నిలిచిపోనుంది. దీంతోపాటు గువాహటి నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు, సికింద్రాబాద్ నుంచి షాలిమర్ వెళ్లే రైలు, షాలిమర్-సికింద్రాబాద్ రైళ్లు కూడా రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.