Tirumala: తిరుమలలో మరోసారి కోవిడ్ ఆంక్షలు
Tirumala: తిరుమల కొండపై మరోసారి కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Tirumala: తిరుమల కొండపై మరోసారి కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కరోనా సెంకడ్ వేవ్ విజృంభిస్తుండడంతో భక్తుల ఆరోగ్య భధ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి దర్శన టిక్కెట్ల కోటాను తగ్గించి పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్ధం నిత్యం 70 వేల నుంచి లక్ష మంది భక్తులు వరకు వస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టీటీడీ అదికారులు మరొకసారి కోవిడ్ నిబంధనలు అమలు పరుస్తున్నారు.
ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతు ఉండే వెంగమాంబ అన్నప్రసాద సత్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, లడ్డు కౌంటర్లు, పీఏసీ యాత్రికుల వసతి సముదాయాలలోను, తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండ, రెండు గంటలకు ఒకమారు క్రిమి నాశక మందులు పిచికారీ చేస్తున్నారు. ఇక తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అలిపిరి నడక, రోడ్డు మార్గం, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలోను స్క్రీనింగ్ టెస్టులు, వాహనాలపై క్రిమి నాశక మందులు స్ప్రే చేస్తున్నారు. పుష్కరిణిలో అధిక సంఖ్యలో భక్తులు సామూహికంగా స్నానం ఆచరించడం వ్యాధి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న కారణంగా పుష్కరిణిలోకి భక్తులు అనుమతిని పూర్తిగా రద్దు చేసింది.
ఈ నెల 12 నుంచి టైం స్లాట్ టోకెన్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఉగాది నుండి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని తీసుకున్న నిర్ణయంపై టీటీడీ వాయిదా వేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన్ టిక్కెట్లకు సంబంధించి ఒక రోజుకు 15 వేలకు మందికి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాల్సిగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వాయిదా వేసుకున్నవారు 90 రోజుల లోపు శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఏకీభవిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండడంతో తమకు దర్శనం బాగా జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐ భక్తులు 28 రోజులు దాటినా తరువాతే స్వామివారి దర్శనానికి రావాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.