Coronavirus Updates From Eluru: ఏలూర్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నగర పరిధిలోని గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కరోనా బారిన పడటం జనాలను కలవరపెడుతోంది. తాజాగా ఓ గ్రామ వాలంటీర్ ద్వారా ఏలూర్ లో నలభై మందికి కరోనా సోకడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న గ్రామ సచివాలయాలను కరోనా భయం వణికిస్తోంది. ఇప్పటికే ఏలూర్ నగర పరిధిలోని గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 9 మంది కరోనా బారిన పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నగరంలోని పాముల దిబ్బ, కొత్తపేట, చేపలతూము సెంటర్, వన్ టౌన్ మొదలైన ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది.
వాలంటీర్లకు కరోనా పాజిటివ్ రావడంతో సచివాలయాలకు వెళ్లడానికి స్థానికులు బెంబేలెత్తుతోన్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఈకేవైసీ తీసుకుంటున్నారు. ఓ వైపు వాలంటీర్లు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుండగా కరోనా బాధితులను కలుస్తూ గ్రామాల్లో కలియ తిరుగుతోన్న ఏఎన్ఎంలు నేరుగా ఇంటింటికి వచ్చి వివరాలు సేకరించడంతో హడలెత్తిపోతున్నారు స్థానికులు.
ఏదేమైనా నిత్యం గ్రామాల్లో తిరుగుతూ జనాలతో మమేకమయ్యే వాలంటీర్లకు కరోనా సోకడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సామాజిక వ్యాప్తి లేని చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు ఏలూరు వాసులు.